ఏ తారలోను నీ తీరులేదు..
ఏ పూవులోను నీ నవ్వులేదు..
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే
పాత్రల్లో ఎన్నదగినది
రాణీ మాలినీ దేవి..
ఆ పాత్రను జమున
పోషించిన తీరు అపూర్వం..
ఖరీదైన జరీ అంచు పట్టు
చీర..భుజాలపై శాలువ..
కళ్లకు నల్ల చలువ కళ్లద్దాలు..
అణువణువునా ఉట్టిపడే రాజసం..గర్వంతో నిండిన కంఠస్వరం..అహంకారం
నిండిన మాడ్యులేషన్..
అంతటి ఎస్వీఆర్…గుమ్మడి
వంటి మహానటుల్నే
లెక్కచేయని నైజం..
పండంటికాపురం సినిమాకి
జమునే కీలకం..ఆమె అభినయమే ఆ చలన చిత్రానికి ప్రాణం..!
అలాంటి పాత్ర అంతకు
ముందు ఏ నటి పోషించలేదు..భవిష్యత్తులో ఎవరైనా ప్రయత్నించినా
ఆమెలా మెప్పించలేరు.
నభూతో నభవిష్యత్..
ఆ హుందాతనం జమునకే చెల్లు..!
నిజానికి ఈ తరహా
పొగరుబోతు పాత్రల ప్రస్థానాన్ని జమున
బ్లాక్ అండ్ వైట్
సినిమాల యుగంలోనే ప్రారంభించారు.
గుండమ్మకథలో సరోజ..
ఒకపక్క సావిత్రి తనకి కొట్టిన పిండి వంటి పాత్రలో అభినయ ప్రదర్శన చేస్తుంటే..తెర మొత్తం అంజిగాడి రూపంలో నందమూరి తారకరామారావు వీరవిహారం చేస్తుంటే..
మేడ మీద చిలక సరోజ..
గుండమ్మ రెండో కూతురు..
గుండుబోగుల వారి
గారాలపట్టి..అమ్మా కాఫీ
అదే ఫస్ట్ అప్పియరెన్స్..
ఒక పెద్దింటి పిల్ల.. గంటయ్య అన్నట్టు తల్లి గారాబంతో పెరిగిన అమ్మాయి..
ఎలా ఉంటుందో
కళ్ల ముందు సజీవంగా ఆవిష్కరించిన జమున..
అభినయానికి పరాకాష్ట..!
గలగలా పారే గోదారిలా
కల్మషం ఎరుగని మనసు..
ఆ గోదావరి గట్టున…చెట్టు
కొమ్మన పిట్ట..ఆ పిట్ట మనసులో ఏముందో..
అంత అల్లరి పిల్లా
శాంతగంభీరమూర్తిగా
కంట నీటి చారికతో..తనకూ
మనసుందని చెప్పాలనే కోరికతో..మానూ మాకును
కాను..రాయీ రప్పను
కానే కాను..మామూలు మడిసిని నేను..నీ మడిసిని నేను..
అక్కినేని..సావిత్రితో సరిసమాన అభినయం..
పండు ముదుసలిగా తన
గోపి చేతిలో కన్నుమూసిన గౌరి..జమున అభినయ వైశిష్టికి మరో నమూనా..!
మళ్ళున్నా..మాన్యాలున్నా
మంచె మీద మగువుండాలి..
పాడి ఉన్నా పంటలు ఉన్నా పంచుకునే మనిషుండాలి..
అత్త ఒడి పువ్వు వలే మెత్తనమ్మా..ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..
ఇల్లాలి పాత్రను అవలీలగా పోషించే జమున అద్వితీయ అభినయానికి ఇంకో రెండు
అద్భుత పాత్రలు తోడునీడ..
ఉండమ్మా బొట్టు పెడతా…
ఈ రెండు సినిమాల్లో జమున రూపం..అభినయం..
అపురూపమే. లేతమనసులు..
ధనమా దైవమా..
మురళీకృష్ణ
చిరంజీవులు..
రాము..
మూగనోము
వేటికవే విభిన్నమైన పాత్రలు..విలక్షణమైన అభినయం..ఇలాంటి పాత్రలు ఎన్నిటినో పోషించి
తన ప్రత్యేకతను చాటుకున్నారు జమున..!
ఇక గులేబకావళి లో ఎందరి
మనసుల్ని దోచుకుందో
వన్నెల దొరసాని..కన్నులలో నాయకుని దాచుకుని..
ఏకవీర కె ఆర్ విజయ ప్రధాన పాత్ర..అయినా జమున
మరో అభినయధార..
తెలిసిందిలే..తెలిసిందిలే..
నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
రామునితో పెళ్లి చూపుల వేళ
బెంబేలెత్తి భీముని
చురుకైన మనసు తెలుసుకున్న సొగసైన కనులున్న సుందరి..!
తన హీరోలైన ఎన్టీఆర్..శోభన్..కృష్ణ..
కృష్ణంరాజు వంటి వారికి
తల్లిగా వేసి మెప్పించిన
అభినయ కౌశలం
జమున సొంతం..!
ఇన్ని చెప్పిన తర్వాత సత్యభామ పాత్ర పోషణ గురించి రాయకపోతే కథ పూర్తయ్యేనా..
మీరజాల గలడా
నా యానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి..
సాత్రాజితి హొయలు..
ఆ ఆత్మవిశ్వాసం..
ఆ స్వాతిశయం..
ఆ రూపలావణ్యం..
టెక్కు..నిక్కు..
అంతకు ముందు..ఆ తర్వాత అదే సత్యభామ పాత్రను అదే ఎన్టీఆర్ జతగా ఎందరు పోషించినా సత్యభామ అంటే జమునే..
అనేంత ముద్ర వేసిన అభినయం..
మరీ ముఖ్యంగా శ్రీకృష్ణతులాభారం సినిమాలో నారద మహర్షి పతిదాన వ్రతం గురించి చెప్పింది మొదలు..ఆ విధానానికి శ్రీకృష్ణుడిని ఒప్పించడం..మీ బరువు నాకు తెలియదా స్వామి అంటూ అతిశయ ప్రదర్శన.. మునికి పతిని దానమివ్వడం..నల్లనయ్య ఎంతకీ తూగకపోవడంతో ఆందోళన..మునివరా అంటూ నారదుని వెంట తిరుగుతూ పతి కోసం ప్రాధేయపడడం..
చివరకు సవతి రుక్మిణి వద్దకు వెళ్ళి స్వామిని దక్కించు అక్కా అని వేడుకోవడం..
పశ్చాత్తాపం..సాక్షాత్తు సత్యభామే కళ్ళు ముందు ఉందా అనేంతలా జమున
అభినయం ఎప్పటికీ మనసులో నిలిచి ఉండిపోతుంది.
ఔను..ఎందరు నాయికలున్నా సావిత్రి..జమున ప్రత్యేకం..!
జమునంటే అందం..
జమునంటే అభినయం..
జమునంటే అద్భుతం..!
పగలే వెన్నెల..
జమున..
కదిలే ఊహాలకే కన్నులుంటే..
అది జమున..!
అభిమాన నటి జమునకు
అక్షర ప్రణామాలు..
– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286
7995666286