– 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే
– సిగార్లు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నును 28 శాతం నుంచి 40 శాతానికి పెంచుతూ నిర్ణయం
– సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల శ్లాబులను హేతుబద్ధీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాన్యులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్కరణల వల్ల వర్గీకరణ సంబంధిత వివాదాలు తగ్గడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో ఇకపై కేవలం రెండే శ్లాబులు అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం, 12 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేసి, కేవలం 5 శాతం, 18 శాతం శ్లాబులను మాత్రమే కొనసాగించనున్నారు.
ప్రజలు నిత్యం వినియోగించే అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ముఖ్యంగా హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్, డెంటల్ ఫ్లాస్ వంటి పర్సనల్ కేర్ ఉత్పత్తులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
నమ్కీన్లు, భుజియా, మిక్చర్లు, ఇతర రెడీ-టు-ఈట్ ప్యాకేజ్డ్ స్నాక్స్‌పై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో ఇవి మరింత అందుబాటు ధరల్లోకి రానున్నాయి.
కొన్ని వస్తువులపై ప్రభుత్వం పన్ను భారాన్ని భారీగా పెంచింది. సిగార్లు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నును 28 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చక్కెర లేదా ఇతర స్వీటెనర్లు కలిపిన అన్ని రకాల పానీయాలు, ఏరియేటెడ్ వాటర్స్‌పై కూడా పన్నును 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. సేవలపై చేసిన మార్పులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కౌన్సిల్ స్పష్టం చేసింది.
పన్ను రేట్లను హేతుబద్ధీకరించడం ద్వారా సామాన్యులు, మహిళలు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించినట్లుగా, నిర్మాణాత్మక సంస్కరణలు, రేట్ల హేతుబద్ధీకరణ, జీవన సౌలభ్యం అనే మూడు స్తంభాలపై దృష్టి సారించి ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.