– ఒకరి హత్యపై పోలీసులకు కఠిన ఆదేశాలు
– ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు
– మంత్రి సత్యకుమార్
ధర్మవరం: పట్టణంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర హత్యా ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేతిరెడ్డి కాలనీకి చెందిన తలారి లోకేంద్ర అనేక క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా, ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌గా నమోదు అయ్యాడు. అతని మీద గతంలో ఒక మహిళా హత్య కేసుతో పాటు మరొక హత్య కేసు సహా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుడు గురువారం హత్యకు గురయ్యాడు.
గతంలో లోకేంద్ర చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసులరెడ్డి కుమారుడు బాలకృష్ణరెడ్డి, ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో లోకేంద్రపై దాడి చేసి హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం.
ఘటన చోటుచేసుకున్న వెంటనే మంత్రి నియోజకవర్గ ఇన్‌ఛార్జి హరీష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం, ఈ విషయంపై వెంటనే సత్య కుమార్ యాదవ్ కి, పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. ఈ ఘోర ఘటనపై మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలో అరాచక శక్తులకు అస్సలు చోటు ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మవరం పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఎవరికైనా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ధర్మవరం పట్టణ ప్రజల్లో ఈ ఘటన ఆందోళన కలిగించినప్పటికీ, పోలీస్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వెనుక ఎవరు ఉన్నా వారిని వదిలిపెట్టబోమని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికితీస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.