– వైసీపీకి హిందువులు అంటే గిట్టదు
– ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్
మంగళగిరి : గణేష్ మండపం వద్ద బిర్యానీ వడ్డించి భక్తుల మనోభావాలపై వైసీపీ దాడి చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. కానీ, దురదృష్టవశాత్తూ వైసీపీ నేతలు నందిగామలో చేసిన ఘటన ప్రతి హిందువును బాధపెట్టింది. పవిత్రమైన వినాయక మండపంలో చికెన్ బిర్యానీ వండించి వడ్డించడం దేవుని అవమానపరిచే ప్రయత్నం కాదా? ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే సాక్షాత్తూ ఈ వ్యవహారంలో ఉండటం మరింత బాధాకరం. ఇలాంటి సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోజూ మీడియా ముందు నిలబడి చిన్నా పెద్దా విషయాలపై స్పందించే జగన్, హిందూ దేవతల అవమానంపై ఎందుకు నోరు విప్పలేదు? ఇది ప్రజలకు పెద్ద ప్రశ్న.
వైసీపీ ఐదేళ్ల పాలనలో హిందూ మతాన్ని దెబ్బతీసే చర్యలు, తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు, వర్గాల మధ్య విభజనలు వరుసగా జరిగాయి. ఇప్పుడు వినాయక మండపాల్లో జరిగిన ఈ ఘటన కూడా అదే దారిలో మరో ఉదాహరణ. ఇదే కాకుండా, ప్రజలను మభ్యపెట్టడం, ఫేక్ ప్రచారాలు చేయడం వైసీపీ ప్రత్యేకత. కృష్ణమ్మ నీళ్లు కుప్పానికి చేరుకున్న సందర్భంలో కూడా తప్పుడు వీడియోలు సృష్టించి చంద్రబాబుని, ప్రభుత్వాన్ని అపహాస్యం చేయడానికి ప్రయత్నించారు. వాస్తవానికి, కుప్పంలోకి నీళ్లు విడుదలైన తర్వాతే ఈ ఫేక్ వీడియోలతో ప్రజలలో గందరగోళం సృష్టించడానికి వైసీపీ ప్రయత్నించింది.
ప్రజలు అయితే ఈ అబద్ధాల రాజకీయాలను బహిర్గతం చేశారు. అందుకే 151 సీట్లు ఇచ్చిన ప్రజలు, చివరికి వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. హిందూ మతం మీద దాడులు, దేవుళ్ల మీద అపచారాలు, ఫేక్ ప్రచారాలే ఆ పార్టీని ప్రజల దృష్టిలో దించేశాయి. ఇప్పటికైనా వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మత విశ్వాసాలను గౌరవించాలి. లేకపోతే ప్రజలు మరింత తీవ్రంగా తిరస్కరిస్తారు. ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండదు. ఇటువంటి పనులు చేస్తే కేసులు నమోదు చేసి తగిన చర్యలు తప్పక తీసుకుంటాం.
వైసీపీ చేసిన ఈ సంఘటన ఒక్కటే చెప్పగలదు…. వాళ్లకి హిందూ మతపరమైన విలువల పట్ల గౌరవం లేదు. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ అవమానానికి సమాధానం ఇస్తారని నాకు నమ్మకం ఉందని ఆయన అన్నారు.