– జాతీయ స్దిరాస్తి అభివృద్ది మండలి (నారెడ్కో) రాష్ట్ర ఛైర్మన్ గద్దె చక్రధర్
– ప్రదర్శనలో వినియోగదారులకు ప్రత్యేక రాయితీలు, తక్షణ రుణ మంజూరు
– ప్రాపర్టీ ఫెస్టివల్ ప్రారంభ సూచనగా ప్రత్యేక కార్యక్రమం, వీడియో ఆవిష్కరణ
విజయవాడ : రాజధాని వైభవాన్ని ప్రతిబించేలా ఏర్పాటు చేస్తున్న అమరావతి ప్రాపర్టీ పెస్టివల్ 2025ను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ స్దిరాస్తి అభివృద్ది మండలి (నారెడ్కో) రాష్ట్ర ఛైర్మన్ గద్దె చక్రధర్ అన్నారు. అందరికీ అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకునే శుభతరుణం ఇదేనన్నారు.
శనివారం నగరంలోని పార్క్ హయత్ లో ప్రాపర్టీ ఫెస్టివల్ ప్రారంభ సూచనగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవానికి సంబంధించి అన్ని విశేషాలతో తీర్చిదిద్దిన దృశ్య శ్రవణ ప్రదర్శనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్ధిరాస్తి రంగం పట్ల అత్యంత సానుకూలంగా చేపట్టిన సంస్కరణల ఫలితంగా ప్రస్తుతం పురోగమన దిశలో ఉన్నామన్నారు.
నారెడ్కో సెంట్రల్ జోన్ ఛైర్మన్ సందీప్ మండవ మాట్లాడుతూ సెప్టెంబరు 19,20,21 తేదీలలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వినియోగదారులకు అమ్మకం దారులు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నాయన్నారు. అర్హతలు ఉన్న వారికి బ్యాంకులు సైతం తక్షణ రుణ మంజూరు పత్రాలు అందచేస్తాయని వివరించారు. సిఆర్ డిఎ సైతం ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసి అయా లేఅవుట్ లు, అపార్ట్ మెంట్ లకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతుందన్నారు.
రానున్న రోజుల్లో అమరావతి ప్రాంతంలో ధరలు పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతమే పెట్టుబదులకు అనువైన సమయమన్నారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి మాట్లాడుతూ ఎ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే స్ధిరాస్తి ఉత్సవాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించనున్నారన్నారు. అరవైకి పైగా ప్రదర్శన సంస్ధలు తమ ఉత్పత్తులను ప్రజలకు వివరిస్తాయన్నారు.
రాష్ట్ర కోశాధికారి చావా రమేష్ మాట్లాడుతూ, సాధారణ రిజిస్ట్రేషన్ తో ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రవేశం కల్పించామని, ప్రాపర్టీ ఫెస్టివల్ వద్ద తక్షణ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని వివరించారు.
సెంట్రల్ జోన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం స్ధిరాస్తి రంగాన్ని బలోపేతం చేయటం వల్లే ప్రస్తుతం విభిన్న ప్రాజెక్టులు వినియోగదారులకు అందుబాటుకి వచ్చాయన్నారు.
సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి ఎస్ వి రమణ మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం వేగవంతమైన తరుణంలో అందరి దృష్టి ఇక్కడే ఉందన్నారు. కార్యక్రమంలో సిఆర్డిఎ ప్రతినిధులు , సీతారామయ్య, వాసిరెడ్డి వంశీ, పివి కృష్ణ, కోడే జగన్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దసరా సమయంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ ను ప్రజలలోకి తీసుకువెళ్లేలా నారెడ్కో వేదిక ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రతినిధి బృందం నిర్ణయించింది.