– భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన హోం మంత్రి అనిత
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనంతపురంలో బుధవారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్ వ్యవస్థ ద్వారా తొలిసారిగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
ఐదు వేల మంది పోలీసులతో సూపర్ 6 సూపర్ హిట్ సభకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత పాలకులు బయటకు వస్తే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను పూర్తిగా నియంత్రించామన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు త్వరలోనే చట్టం రాబోతోందని మంత్రి పేర్కొన్నారు.
ఫేక్ ప్రచారాలు చేసే వారిని ఖచ్చితంగా నియంత్రిస్తామన్నారు. అనంతరం, పార్కింగ్ ప్రదేశాలతో పాటు వీఐపీల భద్రతా ఏర్పాట్ల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే, సభ కారణంగా ఎక్కడ ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.