– మంత్రి సత్యకుమార్ విమర్శ
అమరావతి: అనంతపురంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభ నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పత్రికా సమావేశాన్ని నిర్వహించి తనకు ఆనవాయితీ అయిన విష ప్రచారాన్ని కొనసాగించారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పిన మేరకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుండడంతో వెన్నులో వణుకు పుట్టి జగన్ రెడ్డి అసత్యాలకు, విష ప్రచారానికి దిగజారారని, ప్రజలు ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోరని మంత్రి స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా పిపిపి విధానంలో నూతన వైద్య కళాశాలల నిర్మాణం, హైబ్రిడ్ విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకాలపై జగన్ రెడ్డి వ్యాఖ్యలను, ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ విషయాలకు సంబంధించి సోదాహరణంగా మాజీ ముఖ్యమంత్రిని ఆయన నిలదీశారు.
పిపిపి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై జగన్ దుష్ప్రచారంపట్ల మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆక్షేపణ వెలిబుచ్చారు. ఈ విషయంపట్ల మాజీ ముఖ్యమంత్రిగా జగన్ నిర్వాకాలను వెల్లడిస్తూ కేవలం ఆయన వైఖరి వల్లనే కొన్ని నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పిపిపి పద్ధతిలో చేపట్టాల్సి వచ్చిందని మంత్రి అన్నారు.
తన పాలనలో నాలుగేళ్లలో కేవలం రూ.1450 కోట్లు మాత్రమే వ్యయం చేసిన జగన్ రెడ్డి…మొత్తం ఖర్చు అంచనాలో మిగిలిన రూ.7000 కోట్లను 2024 జూన్లో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం మొదటి ఏడాలోనే చేయాలనడం తనకో నీతి…ఇతరలకు మరొకటి అన్న చందంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.