– విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
మంగళగిరి: వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. జగన్ అంటే ‘అబద్ధాల పుట్ట’, ‘నేరాల దిట్ట’, ‘అవినీతికి పరాకాష్ఠ’గా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ఓర్వలేక జగన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మెడికల్ కాలేజీల విషయంలో జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలను చూస్తే ‘ఆహా’ అనడం కాదు, ‘ఖర్మ రా బాబు’ అనిపిస్తుంది. ఆదోని, పాలకొల్లు, మదనపల్లి, పెనుకొండ ప్రాంతాల్లో కాలేజీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 27 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని, హైదరాబాద్లోని నిమ్స్, తిరుపతిలోని బర్డ్స్ వంటి సంస్థలను నిర్మించి వైద్యసేవలు అందించారని అన్నారు.
కోవిడ్ సమయంలో వైసీపీ నాయకులు, మంత్రులు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన పరిస్థితిని ప్రస్తావిస్తూ వైద్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు సీట్లను అమ్ముకుందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ 85 శాతం హామీలను విస్మరించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తుంటే ప్రజలందరూ హర్షిస్తున్నారని అది చూసి ఓర్వలేక జగన్ ఆవేదనతో మాట్లాడుతున్నారని అన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు కొన్ని కోట్ల రూపాయలు ఆదా అయిందని, ఈ పథకం అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పారు. మెడికల్ కాలేజీలపై జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారాలను ప్రజలు ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఎప్పుడు కూడా శవ రాజకీయాలు. రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడితే బెదిరింపులకు పాల్పడే మీరు, ఇప్పుడు అధికారంలోకి వస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రజలను మోసగించారని, అందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మరో 25 ఏళ్ళు అధికారంలో ఉంటుందని పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకత్వం చెప్తుంటే అది చూసి భయాందోళనలకు గురై జగన్ ఒక సైకోలాగా తయారయ్యారని విమర్శించారు