• గత ప్రభుత్వం హాయాంలో మెడికల్ కాలేజీలకు ఒక్క రూపాయి కేటాయించలేదు.
• కేంద్రం ఇచ్చిన నిధులతో మాత్రమే గత ప్రభుత్వం 5 మెడికల్ కాలేజీలను అదీ అరకొరగా నిర్మించారన్నది వాస్తవం
• మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తామనడం శుద్ధ అబద్ధం
• రాష్ట్రంలోని 1150కు పైగా పీహెచ్ సీ సెంటర్లును ఆధునీకరించాం
– మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్
అమరావతి: హెల్త్, వెల్త్, హ్యాపీ అనే నినాదంతో సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ లు అన్నారు. ఏపీ సచివాలంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్ మరియు రిలేషన్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. పీపీపీ మోడల్ లో కాలేజీలను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గత పాలకుల హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కేవలం కేంద్రం కేటాయించిన నిధులనే వినియోగించారన్నారు. 5 కాలేజీలకు కేవలం గోడలు, స్లాబులు, రంగులు వేసి మెడికల్ కాలేజీ కట్టామని చెప్పుకుంటున్నారని, ఇందుకు కేవలం కేంద్ర నిధులు రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని వివరించారు. ఆయా కాలేజీల్లో రాష్ట్ర వాటాగా మౌలిక సదుపాయాలు, పరికరాల కొనుగోలుకు ఇంకా రూ. 1900 కోట్లు అవసరమని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ప్రతి మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించనుందని వివరించారు. అయితే ఆ భారం సామాన్యుడిపై పడకుండా ఉండేందుకు పీపీపీ మోడల్ లో ముందుకు వెళుతున్నామన్నారు. పీపీపీ మోడల్ తో మెడికల్ కాలేజీలు నిర్మించినా ఫీజులు మాత్రం గతంలో వలే ఉంటాయని తెలిపారు.
ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆశయమని, అందుకు అనుగుణంగా 1995 నుండి ఆయన పాలనలో మన రాష్ట్రానికి అనేక మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని, అలాగే ఎయిమ్స్, బసవతారకం క్యాన్సర్ వైద్యశాల తదితర సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు సీఎం చంద్రబాబు మన రాష్ట్రంలో ఏర్పాటుకు కృషి చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
కూటమి మంచి ప్రభుత్వం : మంత్రి వాసంశెట్టి సుభాష్
కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అంతే ప్రాధాన్యతను సంక్షేమానికి ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని కార్మిక శాఖ, ప్యాక్టరీస్, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మించిందని అంటున్నారని, కాని వాస్తవంగా 5 మెడికల్ కాలేజీలు అరకొరగా నిర్మించారని, కేవలం కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఆ భవనాలను నిర్మించారని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను మాత్రం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో ఆ భారం కూటమి ప్రభుత్వంపై పడిందన్నారు.