ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 14-15, 2025న అమరావతిలో నిర్వహించిన నాలుగో కలెక్టర్ల సమావేశం కేవలం రెండు రోజుల సమీక్షా సమావేశం కాదు. పాలనా DNAను రీరైట్ చేసిన చరిత్రాత్మక ఘట్టం. డేటా డ్రివెన్ డెసిషన్లు, క్వాంటం కంప్యూటింగ్ ఇంటిగ్రేషన్, సర్క్యులర్ ఎకానమీ విజన్, ‘ఎవరీ హౌస్‌హోల్డ్ ఎంటర్ప్రెన్యూర్’ మిషన్‌తో ఆంధ్రప్రదేశ్ “ఫ్యూచర్ రెడీ స్టేట్” కాకుండా “ఫ్యూచర్ క్రియేటర్ స్టేట్”గా మారిపోయింది.
మన మిత్ర వాట్సాప్ నుంచి క్వాంటం కంప్యూటర్ వరకు, గ్రామ పంచాయతీ నుంచి గ్లోబల్ బెంచ్‌మార్క్ వరకు, లెగసీ వేస్ట్ నుంచి లెగసీ బిల్డింగ్ వరకు – ప్రతి రంగంలో కొత్త ప్రమాణాలు సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా గవర్నెన్స్ ఇన్స్పిరేషన్ అందిస్తోంది.
“మనం కేవలం రిపోర్టులు వినడానికి ఇక్కడ లేము – మనం భవిష్యత్తును రూపొందించడానికి వచ్చాము. మీరు నా టీమ్, చీటికీ మాటికీ మార్చను. ఇక్కడ నా గవర్నెన్స్ అల్యుమ్ని నెట్‌వర్క్‌లో కేంద్ర ఐటీ అధికారుల నుంచి ఆర్బీఐ గవర్నర్ వరకు గుర్తు చేస్తూ.. మీ ముందు సమర్థులు పనిచేశారు, అవకాశంగా భావించి సమర్థతను నిరూపించుకునే కొలమానం, ర్యాంకింగ్ వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయని, కొత్త కలెక్టర్లుగా వచ్చిన వారికి ‘మన అదృష్టం ఆంధ్రాకు రావడం’ అని భావించేలా సీఎం మాటలు ఉత్సాహాన్ని నింపాయి. వారి కృషిని అభినందించడం, వారి నైతిక స్థైర్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ప్రభుత్వం తమపై నమ్మకం ఉంచి, వారికి స్వేచ్ఛను ఇస్తుందని భావించినప్పుడు, వారు మరింత అంకితభావంతో పనిచేస్తారు. ఇది ప్రజలకు మేలు చేస్తుంది.”
కలెక్టర్లు తమ క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా ఉన్నత స్థాయిలో లేవనెత్తడానికి అవకాశం కల్పించారు. వినూత్న ఆలోచనలను, పరిష్కారాలను ఆహ్వానించారు. రెండు రోజులు, ఆరువందలకు పైగా స్లైడ్లను.. 8 విభాగాలుగా చేసి ప్రతి దశలో చర్చ చేయడం, అనుమానాలను అడగడం, సమస్యలను అడగడం, సూచనలు చేస్తూ.. మెరుగైన విధానాన్ని చెప్పమని ప్రోత్సహించారు.
ఈ కలెక్టర్ల సమావేశం కేవలం ప్రభుత్వ ప్రణాళికలకు మాత్రమే పరిమితం కాకుండా, ఐఏఎస్ అధికారులకు ఒక శిక్షణా కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్)గా మరియు వృత్తిపరమైన వృద్ధికి ఒక ఆశాకిరణంలా నిలిచింది. జరిగిన చర్చలు, ప్రభుత్వం యొక్క కార్యాచరణ ప్రణాళికను, తక్షణం మరియు దీర్ఘకాలికంగా, స్పష్టంగా నిర్దేశించాయి.
ఈ సదస్సులో పర్యావరణ పరిరక్షణ మరియు నీటి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇవి చాలా దేశాలు మరియు రాష్ట్రాలు సాధారణంగా విస్మరించే అంశాలు. భూమి మీద పచ్చదనం విషయంలో రాష్ట్రం ప్రస్తుతం ఉన్న 30% కవరేజీ నుంచి 50% వరకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 30 శాతంలో హార్టికల్చర్ ద్వారా ఉన్నది ఎంత, అడవుల ద్వారా ఎంత అనేవరకు విడదీసి చూసి, జిల్లాల వారీగా కూడా చూస్తూ, అర్బన్ ప్రాంతాల్లో కూడా ఎలా పెంచాలి అనే అంశంతో పాటు.. గాలి, నీటి కాలుష్యాల నుంచి రక్షించి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యాలు, లెక్కలు సూక్ష్మస్థాయిలో చర్చించి, నిర్దిష్ట లక్ష్యాలతో వెళుతున్న రాష్ట్రం బహుశా మనదే కావచ్చు.
స్వచ్ఛాంధ్ర మిషన్ కింద, అక్టోబర్ 2025 నాటికి 85.9 లక్షల టన్నుల పాత వ్యర్థాలను తొలగించాలని, మరియు 2027 నాటికి 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను పూర్తి చేయాలని లక్ష్యాలు నిర్దేశించారు. అలాగే, గ్రీన్ ఎనర్జీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, సోలార్ రూఫ్‌టాప్‌లను ప్రోత్సహించడం, మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా ఇంధన పొదుపు సాధించాలని సూచించారు. ఇది గ్లోబల్ వార్మింగ్ సమస్యను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడానికి ఒక క్రియాశీలక అడుగు.
నీటి భద్రతకు సంబంధించి, ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించి, ప్రధాన, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు మరియు చెరువులను పూర్తి సామర్థ్యంతో నింపాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ భవిష్యత్తుకు కీలకమని నొక్కి చెప్పారు.
ఆర్థిక వ్యవస్థకు ఒక పటిష్టమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. 2024-25కి 17.11% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నారు, ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు. 2047 లక్ష్యాలతో పాటు, మండల స్థాయిలో జీఎస్డీపీని లెక్కించడం ప్రారంభించాలని నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఎవరికైనా. ప్రాంతీయ అసమానతలు లేకుండా, పోటీపడి మారాలనుకునే సరికొత్త విధానం ఇది.
“ప్రజా స్నేహపూర్వక రెవెన్యూ వ్యవస్థ” కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకు రావడం నుండి సింహ భాగం భూ సమస్యలే అని వాటిపై దృష్టిపెట్టాలి అని చర్చించారు. ఇది కుటుంబాల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం కాబట్టి దశలవారీగా పరిష్కరించాల్సిందే అనే ఆలోచనలు చేశారు.
రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపరచడానికి, ప్రభుత్వం పది కొత్త మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) నమూనాలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై రాజకీయాలను నేను ఎదుర్కొంటాను, పూర్తి చేయవలసిన బాధ్యత ఆయా యంత్రాంగాలది అని చెబుతూ, ఈ మోడల్ ద్వారా నిధుల కొరతను అధిగమించవచ్చని, మరియు ప్రజలకు మరింత నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించవచ్చని స్పష్టతనిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ యొక్క 512 కేపీఐ ఆధారిత జిల్లా ర్యాంకింగ్ మరియు రియల్-టైమ్ డ్యాష్‌బోర్డులు భారతదేశంలో అత్యంత సమగ్రమైన డేటా-ఆధారిత పాలనా ఫ్రేమ్‌వర్క్‌ను సూచిస్తాయి. 6 పెటాబైట్ డేటా లేక్‌లను వాట్సాప్ పాలనతో అనుసంధానించడం ఒక అపూర్వమైన డిజిటల్ పాలనా వారధిని సృష్టించింది. చాలా రాష్ట్రాలు ఇటువంటి లోతైన డేటా విశ్లేషణను ప్రభుత్వ నిర్ణయాల కోసం ఉపయోగించవు.
జీఎస్డీపీ వృద్ధిని (17.11%) పచ్చదనం లక్ష్యాలు, ఉద్యోగ, ఉపాధి కల్పన మరియు 2047కు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త కావాలనే లక్ష్యాన్ని చేరుకునేలా వేసుకున్న రోడ్‌మ్యాప్ మీద అవలోకనం జరిగింది. ఇతర రాష్ట్రాలు తమ విధానాలను వేర్వేరు “సైలోలలో” (Silos) నిర్వహిస్తాయి, కానీ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలను ఒకే లక్ష్యం వైపు నడిపిస్తుంది.
2047 ‘స్వర్ణాంధ్ర’ వంటి దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌ను, 2029కి ₹29 లక్షల కోట్ల జీఎస్డీపీతో నిర్దిష్ట మైలురాళ్లతో అనుసంధానించడం, ఇతర రాష్ట్రాల నుంచి విభిన్నంగా నిలుస్తుంది. 512 KPIల ఆధారంగా పనితీరు మెట్రిక్స్ మరియు జిల్లా ర్యాంకింగ్ వ్యవస్థ అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి స్పష్టమైన మార్గాన్ని చూపుతాయి. ఇది బాగా పనిచేసే అధికారులకు గుర్తింపు తెచ్చిపెడుతుంది, తద్వారా వారు ఉన్నత పదవులకు ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి.
రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి డేటాను విశ్లేషించడం వల్ల, అనవసరమైన రిపోర్టింగ్‌ల భారం తగ్గి, సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుంది.
చెత్తను, ఈ-వేస్ట్‌ను, స్క్రాప్‌ను భారంగా భావిస్తుంది ప్రపంచం. సర్క్యులర్ ఎకానమీ క్రింద ఎక్కడెక్కడ ఎలా దాని ద్వారా ఆదాయం ఆర్జించాలి, ఉద్యోగాలు కల్పించాలి అనే దిశగా కార్యచరణ చేపట్టడం గొప్పవిషయం. గ్లోబల్ గవర్నెన్స్ ప్రమాణాలను రీడిఫైన్ చేసే మిషన్. ఈ రెండు రోజుల సమావేశం చారిత్రాత్మకమైనది.
– చాకిరేవు