– గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రయాణికులకు ఇక్కట్లు
– ప్లానింగ్ లేక గుంటూరు – విజయవాడ వెళ్లేందుకు ఇబ్బంది
– రూ. 2 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ప్రణాళికలు
– కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు: “వెస్ట్ బైపాస్ వంతెనను సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అయితే వైసీపీ ప్రభుత్వం అవలంబించిన ప్లానింగ్ లేని ప్రణాళికల వల్ల గుంటూరు టు విజయవాడ వెళ్ళే ప్రయాణికులకు కొంత ప్రయాణ దూరం పెరుగుతుంది. స్థానికులకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి కి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం” అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
గుంటూరు నుంచి గొల్లపూడి మీదుగా హైదరాబాద్, విశాఖపట్నం కనెక్టివిటీకి ఉపయోగపడే వెస్ట్ బైపాస్ ను పెమ్మసాని ఎన్ హెచ్ ఎ ఐ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. “నిర్మాణాలు, పెండింగ్ పనులు, అండర్ పాస్ వర్కులు తదితర అంశాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. కాగా, గుంటూరు విజయవాడ మీదుగా వెళ్లే ప్రయాణికులకు హాయ్ ల్యాండ్ సమీపంలోని అండర్ పాస్ నుంచి యూ టర్న్ తీసుకుని జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా 2014 – 19 సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిర్మాణాన్ని వైసీసీ వచ్చాక పూర్తిగా గాడి తప్పింది.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధమవుతున్న ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ఈ సమస్యకు పరిష్కారం అందించబోతున్నాం. అలాగే ఈ అండర్ పాస్ వద్దగల స్థానికులకు ప్రయాణ రాకపోకలకు ఇబ్బంది లేకుండా రూ. 2 కోట్ల నిధులతో ఫుట్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించాం.
డిసెంబర్ చివరికి నిర్మాణం పూర్తి చేసి సంక్రాంతి కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం పనులన్నీ సజావుగా సాగుతున్నాయి.” అని పెమ్మసాని వివరించారు. ఈ పర్యటనలో ఎన్ హెచ్ ఎ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం, ఇతర అధికారులు పాల్గొన్నారు.