(నవీన్)
ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ₹3,500 కోట్ల మద్యం కుంభకోణంలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ప్రభుత్వ విధానాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనుసరించిన పక్కా ప్రణాళికను ఈడీ ఛేదించింది. డొల్ల కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్లు, బంగారు దుకాణాల ద్వారా సాగిన ఈ భారీ మనీలాండరింగ్ వ్యవహారం, దర్యాప్తు సంస్థలనే ఆశ్చర్యపరిచింది.
అక్రమ సంపాదనకు పునాది
ఈ కుంభకోణం మూలాలు 2019 నాటి ప్రభుత్వ మద్యం విధానంలో ఉన్నాయి. ప్రైవేట్ దుకాణాలను రద్దు చేసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా ప్రభుతమే మద్యం అమ్మకాలు చేపట్టింది. ఈ కేంద్రీకృత విధానం ఒక వ్యవస్థీకృత సిండికేట్‌కు వరంగా మారింది. మద్యం సరఫరా ఆర్డర్లను తమకు అనుకూలమైన డిస్టిలరీలకు ఇచ్చేందుకు, ఆటోమేటెడ్ వ్యవస్థను పక్కనపెట్టి మాన్యువల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రముఖ బ్రాండ్లను కాదని, ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు. ఈ ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయల నల్లధనం పోగైంది.
నల్లధనాన్ని ఎలా వైట్ చేశారు
అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి సిండికేట్ రెండు ప్రధాన మార్గాలను ఎంచుకుంది. ఈ మార్గాలను ఛేదించడంపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.
1. డొల్ల కంపెనీల వ్యూహం: ఈ కుంభకోణంలో 30కి పైగా డొల్ల కంపెనీలను సృష్టించారు. వీటికి సరైన చిరునామా గానీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ గానీ లేదు. డిస్టిలరీలు ముడుపుల డబ్బును నేరుగా ఇవ్వకుండా, ఈ డొల్ల కంపెనీలకు బదిలీ చేసేవి. ప్యాకేజింగ్, రవాణా వంటి సేవలు అందించినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించేవారు.
ఉదాహరణకు, ఒకే ఒక్క వాహనం ఉన్న రవాణా సంస్థ, లక్షల మద్యం కేసులను తరలించినట్లు పత్రాలు చూపించడం ఈ మోసం తీవ్రతను తెలియజేస్తుంది. ఈ నకిలీ లావాదేవీల ద్వారా డబ్బు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి చేరేది. అక్కడి నుంచి దాన్ని నగదు రూపంలో డ్రా చేయడం లేదా ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం చేసేవారు.
2. బంగారం కొనుగోళ్ల మార్గం: ఇది అత్యంత తెలివైన, క్లిష్టమైన పద్ధతి. డిస్టిలరీలు తమ బ్యాంకు ఖాతాల్లోని “తెల్ల ధనాన్ని” నేరుగా హైదరాబాద్, చెన్నైలోని ప్రముఖ నగల వ్యాపారులకు బదిలీ చేసేవి. ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసినట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు తీసుకునేవి. దీంతో ఆ లావాదేవీ చట్టబద్ధమైన వ్యాపార ఖర్చుగా వారి లెక్కల్లో. కానీ, కొనుగోలు చేసిన భౌతిక బంగారం మాత్రం సిండికేట్ సభ్యులకు చేరేది. ఈ పద్ధతి ద్వారా, బ్యాంకుల్లో గుర్తించడానికి వీలైన డబ్బును, లెక్కల్లోకి రాని భౌతిక ఆస్తిగా (బంగారం) మార్చారు.
ఈడీకి ఎలా చిక్కారు?
ఈ క్లిష్టమైన నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఈడీకి, రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అందించిన సమాచారం కీలకంగా మారింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు ఈడీకి ఒక మార్గదర్శిగా ఉపయోగపడ్డాయి. డిస్టిలరీల బ్యాంకు ఖాతాల నుండి నగల వ్యాపారులకు, డొల్ల కంపెనీలకు జరిగిన వందల కోట్ల అనుమానాస్పద లావాదేవీలను సిట్ గుర్తించింది.
ఈ ఆధారాలతోనే ఈడీ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ సహా 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో రావు సాహెబ్ బూరుగు మహదేవ్ జ్యువెలర్స్, మోహన్ లాల్ జ్యువెలర్స్ వంటి బంగారు దుకాణాలు, వెంకటేశ్వర ప్యాకేజింగ్ వంటి డొల్ల కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సోదాల్లో కీలకమైన ఆర్థిక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు, నకిలీ ఇన్వాయిస్లు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో పురోగతి
స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. డిస్టిలరీల నుండి డబ్బు ఎప్పుడు, ఎలా బదిలీ అయింది, దానికి సరిగ్గా సరిపోయేలా నగల దుకాణాలు, డొల్ల కంపెనీలు ఇన్వాయిస్లు ఎలా జారీ చేశాయో ఈడీ అధికారులు నిర్ధారించుకుంటున్నారు. ఈ పత్రాల ఆధారంగా, డబ్బు ప్రయాణించిన మార్గాన్ని పూర్తిస్థాయిలో గుర్తించే పనిలో ఉన్నారు.
ఈ ఆధారాల విశ్లేషణ పూర్తయ్యాక, ఈ కుంభకోణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ దర్యాప్తు, ప్రభుత్వ విధానాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యవస్థీకృత నేరగాళ్ల వెన్ను విరిచే దిశగా సాగుతోంది. ఇంత పెద్దస్కామ్ జరిగిన కాలంలో ముఖ్యమంత్రిగా వున్న జగన్ మొత్తం వ్యవహారానికి నైతికంగా బాధ్యత వహించాలి. ఆయన అభిమానులు కూడా ఇది కాదనలేని సత్యం.
( రచయిత సీనియర్ జర్నలిస్ట్)