– అద్దంకి పరిధిలో ఇప్పటికే 3000 సైకిళ్ల పంపిణీ
– ప్రయాణ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి
– ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి: విద్యార్థులు దూరాభారంతోనే లేక రవాణా సౌకర్యాలు లేకపోవడంతోనే చదువుకు దూరం కాకూడదనే అద్దంకి నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
సహచర మంత్రి డీబీవీ స్వామితో కలిపి అద్దంకిలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడంతో పాటు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ముందుగా శ్రీ ప్రకాశం, గొరకాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 400 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఇరువురు మంత్రులు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ బస్సుల కోసం నిరీక్షించడం, తల్లిదండ్రులు సూళ్ల వద్దకు వచ్చి వదిలి వెళ్లడం వంటి ఇబ్బందులు ఇకపై ఉండవు అన్నారు. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి కూడా మంచిది అన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు సుమారు 10,000 మందికి సైకిళ్లను ఉచితంగా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
అన్ని పనులూ ప్రభుత్వాలు చేయలేవని స్పష్టం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎస్ఆర్ నిధులు, స్వచ్చంధ సంస్థలు, స్నేహితులు, దాతల సహాయంతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రూ.4.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఇప్పటి వరకు 15 భవనాలను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా నెడ్ క్యాప్ సహకారంతో సుమారు వెయ్యి కోట్ల విలువయిన 2000 సైకిళ్లను విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు.
విద్యార్థులకు సైకిళ్లు, వికలాంగులకు ట్రైస్కూటర్ల పంపిణీతో వారంతా సంతోషంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా పిల్లల్ని సైకిళ్లపై స్కూళ్లకు పంపించే విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు చెప్పాలన్నారు. జాతీయ రహదారుల్లో ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ సమయంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించాలన్నారు.
ప్రమాదాలు జరగకూడదని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్మార్ట్ రేషన్ కార్డ్ లబ్ధిదారులు పాల్గొ్న్నారు.