– కర్నూలు జిల్లాలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం
కర్నూలు: దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ఆ బంగారు గనిని నిర్వహిస్తున్న సంస్థ వెల్లడించింది.
మొదట తక్కువ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి.. ఆ తర్వాత దాన్ని భారీగా పెంచనున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ఈ బంగారు గని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. దేశ బంగారం అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం కాస్త తగ్గుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిదిరాయి గ్రామాల్లో ఉన్న ఈ బంగారు గని నుంచి బంగారాన్ని వెలికితీసే ప్రాజెక్టును డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) నిర్వహిస్తోంది.
ఈ సంస్థ త్వరలోనే ఆ ప్రాంతంలో బంగారం ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ గని దేశం బంగారు ఉత్పత్తిని గణనీయంగా పెంచనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా భారత్ సుమారు వెయ్యి టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.