– ఉన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసిన ప్రభుత్వ న్యాయవాది
– కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన ప్రధాన న్యాయమూర్తి
అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతి భూభాగంలో కాకుండా గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్మాణ ప్రక్రియలో భాగంగా న్యాయ రాజధాని పేరుతో కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేసిన హెచ్ఆర్సీ, లోకాయుక్త కార్యాలయాలను తిరిగి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని గతంలో అమరావతి జేఏసీ నాయకురాలు డాక్టర్ మద్దిపాటి శైలజ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసు వేశారు.
ఈ కార్యాలయాలు సీఆర్డిఏ చట్టానికి విరుద్ధంగా తరలించారని ఆ కేసులో ఆరోపించారు. ఈ కేసు బుధవారం హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు కేంద్రంగా ఏర్పాటు అయిన కార్యాలయాలను అక్కడే కొనసాగిస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో కేసు విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది కర్నూలు కేంద్రంగానే హెచ్ఆర్సీ లోకాయుక్త కార్యాలయాలు కొనసాగిస్తామని తెలిపారు.
అయితే గతంలో ఈ కార్యాలయాలు అమరావతి తరలిస్తామని ఒక సందర్భంలో తెలిపినప్పటికీ ప్రభుత్వ నిర్ణయం మేరకు కర్నూల్ లోనే కొనసాగిచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు న్యాయస్థానానికి విన్నవించారు. దీనిపై పూర్తిస్థాయి వివరణతో కూడిన కౌంటర్లు దాఖలు చేయాలని కేసు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు.