– రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి తయారీ యూనిట్లు
– అక్కడ్నుంచి బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా సరఫరా
– కల్తీ మద్యం బాటిళ్లకు కంపెనీ పేర్లతో లేబులింగ్, సీల్
– నాలుగు ఏరియాల్లో నలుగురు టీడీపీ నాయకులకు దందా బాధ్యతలు
– తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ టీడీపీ నడిపిస్తున్న కుటీర పరిశ్రమగా మారిపోయిందని, సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ లిక్కర్ తయారీని వ్యవస్థీకృతం చేశారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ కల్తీ లిక్కర్ తయారు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండికొట్టి మరీ ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి టీడీపీ నాయకుల ద్వారా ఈ కల్తీ దందాను నడిపిస్తున్నాడని, బెల్ట్ షాపుల ద్వారా పంపిణీ చేసి ప్రజలతో తాగిస్తున్నాడని ఎమ్మెల్యే తాటిపర్తి వివరించారు. మొలకలచెరువు కల్తీ లిక్కర్ స్కాంలో పట్టుబడిన తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డిని వైయస్సార్సీపీ కోవర్టు అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.
సీఎం చంద్రబాబు కల్తీ లిక్కర్‌పై ప్రజలకు సమాధానం చెప్పలేక పదవుల ఆశ చూపించి పట్టాభిని మీడియా ముందుకు పంపించి నోటికొచ్చినట్టు మాట్లాడిస్తున్నాడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే ముందు పట్టాభి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు తానే బాధ్యుడవుతాడని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా హెచ్చరించారు.
వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. చంద్రబాబు దగ్గర పట్టాభి తన పరపతి పెంచుకోవాలని ఆశపడతున్నాడు. పట్టాభి టెంట్ వేసుకోవాలనుకుంటే చంద్రబాబు ఇంటి ముందు వేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి పదవుల మోజులో పడి నోటికొచ్చినట్టు పేట్రేగి మాట్లాడితే పట్టాభి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో ఏర్పాటైన లిక్కర్ కంపెనీలన్నీ తెలుగుదేశం హయాంలో ఏర్పాటైనవే.
2019-24 మధ్య వైయస్సార్సీపీ హయాంలో ఏవైనా కల్తీ లిక్కర్ మరణాలు సంభవించాయా అని ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా వివరాలు కోరితే ఏ ఒక్కరూ చనిపోలేదని, కనీసం అనారోగ్యంపాలైన ఆనవాళ్లు కూడా లేదని ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు స్పష్టం చేసింది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక నాణ్యమైన లిక్కర్ హామీకి తూట్లు పొడిచేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధికారికంగా కల్తీ లిక్కర్ తయారు చేసి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోంది.