– ప్రజాభిప్రాయ సేకరణలో ముక్తకంఠంతో ప్రజల తిరస్కరణ
పరవాడ : మండలంలో దేశ పాత్రనిపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్ క్వారీ తవ్వకాలకు 9. 709 హెక్టార్లు స్టోన్, గ్రావెల్ మైనింగ్ నిమిత్తం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో తవ్వకాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడారు.
క్వారీ తవ్వకాల వలన ఈ ప్రాంతం తీవ్రమైన కాలుష్యంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్వారీ తవ్వకాల వలన భూగర్భ జలాల నాశనం అయ్యే ప్రమాదం ఉందని పచ్చని పర్యావరణం నాశనం అవుతుందని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే తవ్వకాలు చేపట్టవద్దని డిమాండ్ చేశారు. ఇప్పటికే మంచినీటికి మంచి గాలికి మంచి నేలకి ఈ ప్రాంత ప్రజలు కష్టాలు అనిపిస్తున్నారని అన్నారు. హిందూజా బొగ్గు లారీలు కాలుష్యం, ఎన్ టి పి సి ధూళి కాలుష్యం, ఫార్మా వాయు కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారని ఆందోళ వ్యక్తం చేశారు.
విలువైన వృక్షాలు, వివిధ జాతుల వనమూలికలు కలిగిన అటవీ ప్రాంతం నాశనం అవుతుందని, జీవన ప్రమాణాలు నాశనం అవుతాయని గనికి పదేళ్ళు అనుమతిస్తే ఈ ప్రాంత ప్రజల నాశనం అవుతారని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ క్వారీ తవ్వకాలకు అనుమతి ఇవ్వద్దని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వీవీ రమణ, ఐద్వా జిల్లా పి.మాణిక్యం, సిపిఎం నాయకులు పిడి నాయుడు, గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాలుష్య కుంపటి పెట్టొద్దని ప్రశాంతమైన జీవనం ఇప్పటికే గడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాలకు అనుమతి ఇవ్వద్దని స్నేహం పూరి కాలనీ ప్రజలు వేడుకున్నారు. అనంతరం సమస్యలతో కూడిన మెమొరాండం ఆర్డీవో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఈ కి అందజేశారు.