– ‘వందే మాతరం’ 150 ఏళ్ల సందర్భంగా రాజ్యసభ ప్రత్యేక చర్చలో ఎంపీ సానా సతీష్ బాబు
న్యూఢిల్లీ: జాతీయ భావజాలానికి ప్రతీకగా నిలిచిన వందే మాతరం గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక చర్చలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పాల్గొని భావోద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వందేమాతరం గీతం చరిత్ర, భారత స్వాతంత్య్ర సమరంలోని దాని పాత్ర, అలాగే తన స్వస్థలం కాకినాడతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించారు. ఎంపీ సతీష్ బాబు మాట్లాడుతూ వందే మాతరం గీతం ఏ మతానికీ చెందింది కాదని, మాతృభూమి పట్ల భారతీయుడి ప్రేమను ప్రతిబింబించే జాతీయ గీతమని గుర్తుచేశారు.
బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో లక్షలాది మందికి ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. తన స్వస్థలం కాకినాడలో 1923లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో చోటుచేసుకున్న చారిత్రక సంఘటనను ప్రస్తావించారు. వందే మాతరం గీతంపై అభ్యంతరంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ సభనుంచి బయటకు వెళ్లిన ఘటన చరిత్రలో ఒక బాధాకరమైన అధ్యాయంగా మిగిలిందని పేర్కొన్నారు.
అదే ఘటనకు శతాబ్ద కాలం తర్వాత చరిత్ర ఇచ్చిన సమాధానంగా, నవంబర్ 7, 2025న, కాకినాడలో మౌలానా మహమ్మద్ అలీ వీధికి “వందే మాతరం మార్గ్” అనే పేరు పెట్టిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇది కేవలం ఒక రోడ్డుపేరు మార్పు కాకుండా—జాతీయ చైతన్యానికి ఇచ్చిన గౌరవమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్న విషయాన్ని కూడా పేర్కొన్నారు.
దేశం మొత్తానికి చెందిన గీతం వందే మాతరం అని, చరిత్ర మనల్ని విడదీయకుండా ఏకం చేయాలనేది కాకినాడ నేల నుంచి దేశానికి వెళ్లే తన సందేశమని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఈ చర్చలో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.