– రేవంత్ ఓయూ ప్రసంగం విషపూరితం
– కుక్క తోకకు రాయి కట్టినట్టు ఆయన తీరు మారలేదు
– స్పోర్ట్స్ యూనివర్సిటీకి తెలంగాణ నిపుణులు లేరని కేరళ నుంచి వీసీ తెచ్చారు
– రాహుల్ ఇంగ్లీష్ ప్రాధాన్యత చెబుతుంటే రేవంత్ వ్యతిరేకిస్తారు
– ఉద్యమంపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్ ఓయూలో ఉద్యమం గురించి మాట్లాడటం సిగ్గుచేటు
– మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్ ఎకానమీ రాదు
– తెలంగాణ రైజింగ్ కాదు… రావేజింగ్
– ఓయూ వేదికపై రేవంత్ గందరగోళ ప్రసంగం.. కేసీఆర్‌పై ద్వేషం
– రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వంతో గురుకులాలు నిర్వీర్యం
– ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి కన్నతల్లి లాంటిదని, తాను అక్కడే చదువుకుని విద్యార్థి నాయకుడిగా పనిచేశానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ భవన్లో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నిన్న సీఎం ఓయూ వెళ్తే నాలుగు మంచి మాటలు మాట్లాడతారని అనుకున్నామని, కానీ కుక్క తోకకు రాయి కట్టినట్టు ఆయన తీరు మారలేదని శ్రవణ్ ధ్వజమెత్తారు. సీఎం ప్రసంగం గందరగోళంగా, పొంతన లేని విషపూరితమైనదని విమర్శించారు. ప్రతి వేదికను కేసీఆర్‌పై ద్వేషం వెదజల్లేందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
నల్లమల అడవులతో సీఎంకు ఎలాంటి సంబంధం లేదని, పుట్టిన కొండారెడ్డిపల్లి నుంచి నల్లమలకు గంటన్నర ప్రయాణమని, మొగిలి లాంటి క్రూర జంతువులతో ఆడుకున్నాడేమో అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్ ఓయూలో ఉద్యమం గురించి మాట్లాడటం సిగ్గుచేటని, యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి లాంటి అమరులు తెలంగాణ ద్రోహుల వల్లే ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు.
చదివిన చోటు కాదు, విజ్ఞత ముఖ్యమని, రేవంత్‌కు ఆ విజ్ఞత లేదని, కొండారెడ్డిపల్లి చదువైనా కొలంబియా చదువైనా ఆయన బుద్ధి వంకరబుద్ధే అని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణకు మంత్రి మళ్లీ కృష్ణ, సుప్రీంకోర్టు కారణం కాదు, తానే కారణమన్నట్టు మాట్లాడుతున్నారని, కులగణనకు మోడీ ఒప్పుకోవడం నీతీష్ కుమార్, బీహార్ ఎన్నికల వల్లేనని గుర్తుచేశారు.
రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నవారని, గతంలో ఇంటి ముందు నుంచి వెళ్లేవారు చెప్పులు విడిచి వెళ్లాలన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ స్థాపించిన గురుకులాలను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని, 2.5 లక్షల మందికి నాణ్యత విద్య ఇస్తూ మిగతా 15 లక్షల మందిని విద్యకు దూరం చేస్తున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లపై బీసీల గొంతు కోసి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం డ్రామా అని అన్నారు.
నెహ్రూ ఇరిగేషన్, ఎడ్యుకేషన్ తెచ్చారని, తాను కమ్యూనికేషన్ తెస్తానన్నారని, యంగ్ ఇండియాను గాంధీ నుంచి ప్రేరణగా తీసుకున్నామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. స్కిల్ యూనివర్సిటీలో పట్టుమని పది కోర్సులు లేవని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి తెలంగాణ నిపుణులు లేరని కేరళ నుంచి వీసీ తెచ్చారని విమర్శించారు.
గ్లోబల్ సమిట్‌లో ఇంగ్లీష్ మాట్లాడగలరు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా చదివే ఓయూలో ఇంగ్లీష్ అవసరం లేదంటారని, తనకు రాని ఇంగ్లీష్ ఇతరులకు రాకూడదనేది రేవంత్ విధానమని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఇంగ్లీష్ ప్రాధాన్యత చెబుతుంటే రేవంత్ వ్యతిరేకిస్తారని, ఐటీ రంగం విజయానికి ఇంగ్లీషే కారణమని తెలియదా అని ప్రశ్నించారు.
3 ట్రిలియన్ ఎకానమీ అంటూ మూడు రూపాయల మైండ్‌సెట్‌తో సాధ్యమా అని, 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తూనే ఇంగ్లీష్ వద్దంటున్నారని నవ్వాలా ఏడవాలా అని ప్రశ్నించారు. రేవంత్ హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు రావేజింగ్ అని, గ్లోబల్ సమిట్‌లో ధరించిన బట్టలు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా, చిరంజీవి కంటే నయం బట్టలు వేసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై విషం చల్లే మాటలు మానేస్తే రేవంత్‌కే మంచిదని సూచించారు.