– క్షతగాత్రులకు ఆఘమేఘాలపై చికిత్స అందించిన వైద్యులు
– కోలుకున్న వారిని స్వస్థలాలకు తరలించిన అధికారులు
– నిలకడగా మిగతావారి ఆరోగ్య పరిస్థితి
అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు వైద్యులు, అధికారులు ఆఘమేఘాలపై చికిత్స అందించారు. సమాచారం అందిన వెంటనే వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు హుటాహుటిన తగు ఏర్పాట్లు చేశారు.
ఇదే సమయంలో అక్కడి క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం అదనంగా అవసరమైన మందులు , ఇతర అవసరాల కోసం తక్షణ సాయం కింద రూ.5 లక్షలు విడుదల చేయాలని మంత్రి ఆదేశించడంతో చింతూరు సిహెచ్‌సికి సూపరింటెండెంట్‌కు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు నిధులు మంజూరు చేశారు. ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా చింతూరు సామాజిక ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు రంపచోడవరం, రాజమండ్రి ఆసుపత్రుల నుండి ఆర్థో , జనరల్ సర్జరీ, ఇతర స్పెషలిటీ వైద్యుల్ని రప్పించారు. ముఖ్యంగా తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండేందుకు వైద్యులు వేగంగా స్పందించి ఎక్స్‌రేలు, ఇతర పరీక్షలు చేసి ఫలితాలాధారంగా వారికి ఉన్నత వైద్యాన్ని అందించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి తదుపరి ఉన్నత వైద్య చికిత్సల కోసం రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు.
వారి ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతినకుండా ఉండేలా చేయడంలో వైద్యులు, సిబ్బంది సఫలీకృతులయ్యారు. జిల్లా కలెక్టర్ , ఇతర అధికారులు, వైద్యారోగ్య శాఖ అధికారులు మెరుగైన వైద్యం సకాలంలో అందేలా చర్యలు తీసుకున్నారు. దుర్ఘటనలో మరణించిన వారి 9 మృత దేహాలకు వెనువెంటనే పోస్ట్ మార్టం నిర్వహించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో 15 మంది ఆసుపత్రి నుండి డిస్చార్జ్ అయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న 5గురి ప్రాణాల్ని కాపాడారు. కోలుకున్న వారిని వోల్వో బస్సుల్లో వారివారి స్వస్థలాలకు చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మిగతావారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.