– అభివృద్ది, సంక్షేమానికి పట్టం కడుతున్నారు
– వచ్చే పదేళ్లు కాంగ్రెస్ సర్కార్ కు డోఖా లేదు
– ప్రతి పక్షాల విమర్శలకు ప్రజల తీర్పు చెంపపెట్టు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తున్నది
– మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారనీ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈనెల 11న జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కనగల్ మండలం దోరపల్లి గ్రామం సర్పంచ్ గా గెలుపొందిన బక్క ఎల్లమ్మ సోమవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపళ్లి వీరసేనారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్త సర్పంచ్ ఎల్లమ్మను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ పల్లెల్లో అభివృద్ది,సంక్షేమానికి ప్రజలు పట్టం కడుతున్నారనీ అన్నారు. ప్రజల్లో స్పందన చూస్తుంటే వచ్చే పదేళ్లు కాంగ్రెస్ సర్కార్ కు డోఖా లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బిఆర్ఎస్,బీజేపీ పసలేని ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డులు, సన్న బియ్యం, సన్న వడ్లకి బోనస్, ఉచిత బస్సు,200యూనిట్ల ఫ్రీ విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు చేయూత, విద్యా, వైద్యానికి పెద్దపీట వంటి కార్యక్రమాలతో ప్రజా ప్రభుత్వం ప్రజల్లో ఆదరణ చూరగొన్నదని అన్నారు.
ప్రతిపక్షాల విమర్శలకు ప్రజల తీర్పు చెంపపెట్టు లాంటిదని మంత్రి అభిప్రాయ పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తున్నదనీ,తెలంగాణ రైసింగ్ నినాదంతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నదని చెప్పారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమిరెడ్డి రవీందర్ రెడ్డి, కడారి శంకర్, మన్నెం శ్రీనివాస్, భైరగోని దుర్గయ్య , మన్నెం మల్లేష్, మాదగోని సైదులు, బక్క రాజశేఖర్ తదితరులు ఉన్నారు.