– ఉత్తరాంధ్ర మంత్రి బంధువు పేరుతో హవా
– వైసీపీ జమానాలో ప్రాన్స్ ప్రాసెస్ యూనిట్లను వేధించిన ఘనుడన్న ఆరోపణలు
– గోదావరిలో కమ్మ, క్షత్రియ కంపెనీలను హడలెత్తించిన అధికారికి ఉత్తరాంధ్రలో కీలక పోస్టింగ్‌పై విస్మయం
– విజయనగరంలో ఆయన అన్న బొత్స ప్రధాన అనుచరుడట
– శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకూ ఆర్టీఐ దందా
– కాకినాడలో ఒక ఆర్టీఐ యాక్టివిస్టు, కార్మికశాఖ పేషీలో మరో ఉద్యోగితో కలసి ఆర్టీఐ దందా?
– గతంలో గోదావరిలో పనిచేసిన అనుభవంతో ‘జూనియర్’ దందా
– సీఎంఓ కీలక అధికారి వద్ద పనిచేస్తున్న సదరు జూనియర్ సోదరుడు
– సీఎంఓకు చేసే ఫిర్యాదుల అప్‌డేట్స్ తమ్ముడికి చేరవేస్తున్న అన్న?
– ఫిర్యాదుదారుల నుంచి ఆధార్ కార్డు జిరాక్సులు
– మళ్లీ ఆ ఆధార్‌తోనే పీసీబీ, ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటుకు ఫిర్యాదు
– కంపెనీ యజమానులను బెదిరించి వసూళ్లు?
– ఆర్టీఐ యాక్టివిస్టులతో కలసి ‘సర్దుకుపోతున్న’ ఓ పీసీబీ అధికారి
– ఆర్టీఐ ఫిర్యాదులపై స్పందిస్తూ అధికారులను నిలదీస్తున్న పీసీబీ, ఫ్యాక్టరీ బాసులు
– ఆర్టీఐ బెదిరింపుల దందాకు పరిశ్రమలకు మోక్షమేదీ?
– ఆర్టీఐ ఫిర్యాదులపై
– పీసీబీ-పరిశ్రమలు-ఫ్యాక్టరీస్-కార్మికశాఖతో కలిపి కామన్ పోర్టల్ ఎందుకు పెట్టరు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
సీఎం చంద్రబాబునాయుడు, యువ మంత్రి లోకేష్.. కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రపంచదే శాలు తిరుగుతూ, పెట్టుబడులు-పరిశ్రమల కోసం పరిశ్రమిస్తున్నారు. దానికోసం బోలెడు రాయితీలు ప్రకటిస్తున్నారు. సింగిల్ విండో అనుమతులతో అదొక యజ్ఞంలా చేస్తున్నారు.
అయితే పురాణకాలంలో యజ్ఞం చేసే రాజులకు రాక్షసులు మోకాలడ్డినట్లు.. ఈ ఆధునిక కాలంలో ఆర్టీఐ యాక్టివిస్టులు కొందరు అదే పనిచేస్తున్నారు. పరిశ్రమల యజమానులను ఆర్టీఐ దరఖాస్తుల పేరుతో హడలెత్తిస్తున్నారు. కొందరు పీసీబీ-ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ అధికారులతో కుమ్మక్కయి.. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకూ ఈ ఆర్టీఐ దందాను విజయవంతంగా కొనసాగిస్తున్న అరాచక పరిస్థితి పరిశ్రమలను బెంబేలెత్తిస్తోంది.
దీనికి కాకినాడలోని కొందరు ఆర్టీఐ యాక్టివిస్టులు, కార్మికశాఖ పేషీలో పనిచేసే ఓ ‘జూనియర్ అసిస్టెంట్’ సంయుక్త ఆపరేషన్‌కు.. వైసీపీ జమానాలో చక్రం తిప్పిన ఉత్తరాంధ్రలో పనిచేసే ఓ పీసీబీ అధికారి రింగ్‌మాస్టర్‌గా ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై పీసీబీ-ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఆయనో పీసీబీ అధికారి. జగన్ జమానాలో గోదావరి జిల్లాలోని ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులను హడెత్తించిన ఘనుడన్న పేరుంది. ముఖ్యంగా కమ్మ-క్షత్రియ సామాజికవర్గాలకు చెందిన కంపెనీలను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించారన్న ఆరోపణలున్నాయి. ఆయన దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలే యూనిట్లను మూసుకున్న పరిస్థితి. అప్పట్లో ఆయన అన్నగారు విజయనగరం జిల్లాలో వైసీపీ స్థానిక సంస్ధ ప్రజాప్రతినిధిగా వెలిగారు. పైగా నాటి మంత్రి బొత్స ప్రధాన అనుచరుడన్న పేరు. దానితో ఆ అధికారి పీసీబీలో చెప్పిందే వేదం. చేసిందే శాసనంలా ఉండేదన్న పేరుంది.
జగన్ సీఎంగా ఉండగా.. గోదావరి జిల్లాలో సదరు పీసీబీ అధికారికి ఇద్దరు వ్యక్తులు కుడిఎడమ భుజంలా ఉండేవారట. అందులో ఒకరు కాకినాడలో తరచూ ఫ్యాక్టరీలపై ఆర్టీఐ పెట్టే ఒక యాక్టివిస్టు. మరొకరు అక్కడే ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌లో పనిచేసే ఓ ‘జూనియర్’ ఉద్యోగి. ముందు పరిశ్రమలపై ఆర్టీఐ పెట్టడం, ఆ పేరుతో సదరు కంపెనీ యజమానులను పిలిపించి బెదిరించి వారినుంచి దండుకోవడం. ఇదే వారి ఆపరేషన్ స్టైల్! దానికి మార్గదర్శి అప్పటి పీసీబీ అధికారేనన్నది అప్పట్లో వినిపించిన ప్రచారం.
అదెలాగంటే.. ఒక వ్యక్తి పేరుతో వీరే పీసీబీ అధికారి-జిల్లా ఫ్యాక్టరీస్ అధికారికి ఫిర్యాదు చేస్తారు. ఆ తర్వాత మళ్లీ వీరే ఆర్టీఐ దరఖాస్తు చేస్తారు. ఈ వ్యవహారంలో వీరికి ఆధార్ కార్డు బాగా అక్కరకొస్తోందట. అంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి నుంచి ఆధార్ జిరాక్సు తీసుకుంటారట. దాన్ని తీసుకుని తమకు నచ్చని పరిశ్రమలపై ఫిర్యాదు చేస్తారు. ఆ విషయం పాపం ఆధార్ కార్డు ఇచ్చిన ఫిర్యాదుదారులకు తెలియదు. గతంలో తమకు ఫిర్యాదుచేసిన వారి పాత ఆధార్‌కార్డులను కూడా, వీరు ఈ దందాకు వాడుకుంటున్నారట.
ఈ దందాతో పరిశ్రమ యజమానులు బెంబేలెత్తి జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారట. దానిపై ఆయన సంబంధిత అధికారులను విచారించగా.. నిజమేనని, తాము కూడా ఏమీ చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తం చేశారట. పైగా వారంతా దళితులే కావడంతో, ఆ పేరుతో ఎక్కడ కేసులు పెడతారన్న భయంతో, తాము మౌనంగా ఉండాల్సి వస్తుందని అసహాయత వ్యక్తం చేశారు. దానితో ‘వాటిని పట్టించకోవలసిన అవసర ం లేదు. అలాంటి ఫిర్యాదులను పక్కనపెట్టమని’ సెలవిచ్చారట.
నిజానికి కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ పీసీబీ- ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ వరకూ వస్తున్న ఫిర్యాదులు, ఆర్టీఐ దరఖాస్తులు పరిశీలిస్తే, అంతా ఒకరిపేరుతోనే ఎక్కువగా ఉండటం బట్టి.. ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమవుతోంది. అయితే సదరు వైసీపీ జమానాలో చక్రం తిప్పిన ఆ పీసీబీ అధికారే, వీరికి సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గోదావరి టు సెక్రటేరియేట్!
కాగా ఒకప్పుడు గోదావరి జిల్లాలో పనిచేసి, ఇప్పుడు కార్మికశాఖ మంత్రి పేషీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఒక ‘జూనియర్’ ఉద్యోగి, ప్రస్తుతం ఈ వ్యవహారంలో మరింత చెలరేగిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు సదరు జూనియర్ ఉద్యోగి ఫ్యాక్టరీస్ డిపార్టెమెంట్‌లో తనకు నచ్చని అధికారులపై.. ఆకాశరామన్న పేరుతో మంత్రికి లేఖలు రాయించడం, మళ్లీ ఆయనే తనకు నచ్చిన అధికారితో దానిపై విచారణ చేయించి తనకు నచ్చని అధికారిని సస్పెండ్ చేయించడమో, బదిలీ చేయించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారట. పైవారిని తన కళతో మెప్పించి, వారి అవసరాలు తీర్చడంలో ఈ జూనియర్ నిష్ణాతుడన్న పేరు గోదావరి నుంచి అమరావతి వరకూ ఉంద న్న ప్రచారం లేకపోలేదు.
దీనికి ‘కార్మికశాఖ బంధువుల’ సహకారం సంపూర్ణంగా ఉందన్నది మరో ప్రచారం. ఇప్పటికే తన బినామీ సేఫ్టీ ఆడిట్ ఏజెన్సీతో ఏలూరు, కాకినాడ, విశాఖ, విజయవాడ పరిశ్రమల్లో ఫ్యాక్టరీస్ అధికారుల ద్వారా పరిశ్రమల్లో ఆడిట్ చేయిస్తూ, లక్షలు ఆర్జిస్తున్న వైనం బహిరంగ రహస్యమేనట.
నిజానికి అసలు డెప్యుటేషన్‌పై వచ్చి చేసేంత పని కార్మిక శాఖ పేషీలో లేకపోయినా, ఒక్క ఫైలుపై సంతకం చేసే బాధ్యత లేకపోయినా సదరు జూనియర్‌ను ఎందుకు తెచ్చిపెట్టుకున్నారో ఎవరికీ తెలియదు.
ఈ ఫిర్యాదులు, ఆకాశరామన్నతోపాటు, తనకు నచ్చని అధికారులపై చిన్నా చితకా పత్రికల్లో వ్యతిరేక కథనాలు రాయించే ఈ జూనియర్ అంటే అందరికీ భయమేనట. ఇప్పటికే ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో తనకు అనుకూలమైన ఫ్యాక్టరీస్ అధికారులను నియమించుకున్న సదరు జూనియర్ ఉద్యోగి.. తన బినామీ ‘వజ్ర’కు ఆ జిల్లాల్లోనే సేఫ్టీ ఆడిట్ పనులు ఇప్పిస్తుండటం విశేషం. పైగా ఫ్యాక్టరీసు డిపార్టుమెంట్‌కు ఆయా జిల్లాల నుంచే పరిశ్రమలపై ఎక్కువ ఆకాశరామన్న ఫిర్యాదులు వస్తుండటం ప్రస్తావనార్హం.
తమ్ముడు ‘లేబర్’ పేషీలో.. అన్న సీఎంఓలో!
ఇదిలాఉండగా.. ప్రస్తుతం కార్మిక శాఖ పేషీలో పనిచేస్తూ, ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌లో సర్వం తానయి ‘చక్ర’ం తిప్పుతున్న సదరు ‘జూనియర్’ సోదరుడు, సీఎంఓలోని ఒక కీలక అధికారి వద్ద పనిచేస్తున్నారట. తనకు నచ్చిన ఫ్యాక్టరీస్ అధికారులపై చేసే ఆకాశరామన్న ఫిర్యాదులను ఒక కాపీని సీఎంఓకు పంపించి, తన సోదరుడి ద్వారా అటుంచి నరుక్కు వస్తారట. అందుకే తనపై మీడియాలో ఎన్ని వ్యతిరేకవార్తలు వచ్చినా, సీఎంఓలో తన అన్న ఉన్నంతవరకూ తనకు ఏమీ కాదని ధీమాతో ఉన్నారట. సీఎంఓ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుని, పెద్ద తలకు సమాచారం ఇస్తుండటంతో, సదరు పెద్ద తలలు కూడా ‘జూనియర్’ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారట. అది వేరే విషయం!
ఆ పీసీబీ అధికారిపై వైసీపీ ముద్ర
కాగా.. వీరికి రింగ్ లీడర్‌గా ఆరోపణలున్న ఓ పీసీబీ అధికారికి ఉత్తరాంధ్రలోని ఒక మంత్రిగారికి బంధువన్న ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లాలో సదరు అధికారి కుటుంబం గతంలో కాంగ్రెస్, తర్వాత వైసీపీ సేవలో ఉండేదట. సదరు అధికారి సోదరుడు వైసీపీ ఎంపీటీసీగా పనిచేశారట. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరుడిగా పేరుందట. ఆయన గత కరోనాలో మృతి చెందినప్పటికీ, సదరు అధికారికి మాత్రం ఇంకా వైసీపీ బంధం విడిపోలేదంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉంటే బొత్స కార్డు, ఇప్పుడు ఉత్తరాంధ్ర మంత్రిగారి బంధువు కార్డు విరివిరిగా వాడుతూ, ఉత్తరాంధ్రలో కీలక స్థానంలో హవా చెలాయిస్తుండటం.. ఆయన బాధితులైన కమ్మ-క్షత్రియ పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. వైసీపీ హయాంలో తమను వేధించిన ఆ అధికారిని, కూటమి ప్రభుత్వం లూప్‌లైన్‌కు పంపిస్తుందని పాపం ఆ పారిశ్రామికవేత్తలు ఆశించారు. అయితే అందుకు భిన్నంగా.. బాగా ఆదాయం వచ్చే ఉత్తరాంధ్రలో, కీలక ప్రాంతానికి బదిలీ చేయడంతో నిశ్చేష్టులవడం ఆ పారిశ్రామికవేత్తల వంతయిందట. ఇది ‘మరీ ఇంత మంచి ప్రభుత్వం’ అనుకోలేదని ఆశ్చర్యపోతున్నారట.
ఆర్టీఐ బెదిరింపులకు పరిష్కారమేదీ?
పరిమ్రలను బెదిరిస్తున్న ఈ ఆర్టీఐ దందాకు అడ్డుకట్ట వేసే ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకపోవడమే ఆశ్చర్యం. అసలు ఇప్పటివరకూ పరిశ్రమలు-పీసీబీ-ఫ్యాక్టరీస్- కార్మిక శాఖ ఉన్నతాధికారులతో ఒక సమావేశం ఏర్పాటుచేసి, దీనిని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్న స్పృహ కూడా లేకపోవడం మరో వింత.
దీనికి సంబంధించి సీనియర్ అధికారులు చేస్తున్న సూచనలు ఆచరణయోగ్యంగానే కనిపిస్తున్నాయి. ఆ ప్రకారంగా కామన్‌పోర్టల్ పరిశ్రమల వరకూ కామన్‌పోర్టల్ ఏర్పాటుచేసి, అందులో ఆర్‌టిఐ ఫిర్యాదులను ఎంటర్ చేయాలని సూచిస్తున్నారు. దానిని పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, కార్మికశాఖలను అనుసంధానించాలంటున్నారు. ప్రస్తుతం కోర్టుల్లో ఇదే ప్రక్రియ అమలవుతోందని గుర్తు చేస్తున్నారు.
‘ఏపీ లీగల్ కేసెస్ మానటరింగ్ అప్లికేషన్’ ద్వారా కేసుల పురోగతి- ప్రకియ తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా ఆర్టీఐకి సంబంధించి పరిశ్రమలపై వచ్చే ఫిర్యాదులను కూడా ఒక కామన్‌పోర్టల్ ద్వారా పరిష్కరించవచ్చంటున్నారు. దీనితో ఆర్టీఐ దందాను అరికట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
ఫిర్యాదుదారులెవరు? వారి చిరునామా? ఫిర్యాదు చేసిన అంశంతో అతనికి సంబంధం ఉందా? అన్న అంశాన్ని ఆ కామన్‌పోర్టల్ తేత్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అసలు ఫిర్యాదులను సంబంధించి నిర్దిష్టమైనే ఆధారాలు ఉంటేనే వారిపై విచారణ-చర్యలకు ఉపక్రమించాలని, గాలి వార్తలు-ఆకాశరామన్న ఫిర్యాదులను పక్కనపెట్టాలంటున్నారు.
కాగా కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకూ పీసీబీ-ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ సమస్యలపై వచ్చే ఆర్టీఐ ఫిర్యాదుల్లోని, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా.. వారిపై చర్యలు ఏం చేశారంటూ పీసీబీ-ఫ్యాక్టరీస్ బాసులు జిల్లా స్థాయి అధికారులను ప్రశ్నిస్తున్న వైనంపై, అధికారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘‘ విజయవాడలో కూర్చుని ఆకాశరామన్న ఫిర్యాదులపై ఆగ్ర హం వ్యక్తం చేసేవాళ్లు, తమ వైఫల్యాలపై మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలను ఎందుకు పట్టించుకోరు? ఎందుకు చర్యలు తీసుకోరు? శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకూ కొందరు ఆర్టీఐ యాక్టివిస్టులకు ఇదే జీవనాధారం. ఇదే వారి దందా. వారికి ఉన్న దళిత కార్డుతో మమ్మల్ని భయపెడుతున్నారు. ఎదురు తిరిగితే వాట్సాప్ పేపర్లలో వ్యతిరేకంగా వార్తలు రాస్తారు. మాకు రక్షణ కల్పించేదెవరు? ఆ విషయం పైవాళ్లు తెలుసుకోకపోవడమే ఆశ్చర్యం’ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.