జీ.ఎన్. బాలసుబ్రమణియన్ ఎవరు? మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి కర్ణాటక సంగీత విప్లవానికే ఆదర్శం, మార్గదర్శి జీ.ఎన్. బాలసుబ్రమణియన్!
1900-10 దశాబ్దిలో కర్ణాటక సంగీతం కొన్ని కారణాలవల్ల జనాదరణకు దూరమైపోయింది. ఆ దశలో మహారాజపురం విశ్వనాద(థ) అయ్యర్, అరియక్కుడి రామానుజ అయ్యంగార్, చెంబై వెద్దియనాద బాగవదర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, జీ.ఎన్.బాలసుబ్రమణియన్ ఈ ఐదుగురూ పంచప్రాణాలై కర్ణాటక సంగీతానికి కొత్త జీవితాన్నిచ్చారు; తమ మేధతో, ప్రతిభతో కర్ణాటక సంగీతానికి విభవాన్ని తీసుకువచ్చారు. కర్ణాటక సంగీతానికి కొత్త ఊపిరినిచ్చిన పంచప్రాణాల్లో ఒకరు జీ.ఎన్. బాలసుబ్రమణియన్!
సాహిత్యాన్ని చంపకుండా, జిడ్డు లేకుండా గొప్పగా పాడగలిగిన తొలిదశ కర్ణాటక సంగీత గాయకుడు జీ.ఎన్. బాలసుబ్రమణియన్. ఆ విషయంగానూ, గాత్రం పట్టడం, గానం పరంగానూ బాలమురళీకృష్ణ ఈ జీ.ఎన్. బాలసుబ్రమణియన్ శైలిని ఆదర్శంగా తీసుకున్నారు; బాలమురళీకృష్ణ ఒక దశలో జీ .ఎన్. బాలసుబ్రమణియన్‌ను అనుకరిచేవారు.
కళాకారుల మేధ, ప్రతిభ, పరిశ్రమ, పరిశీలన, ఆలోచన, అవగాహనల ఫలితం కళ. ఇది ఏ కళకైనా వర్తిస్తుంది. కళాకారుడు ద్రష్ట. స్రష్ట. కొందఱు కళాకారులు దార్శనికులు. తాము ఒక ప్రమాణాన్ని దర్శించి ఆచరించి ఆ స్థాయికి జనాల్ని తీసుకెళతారు.
ఏది ఉన్నతమైనదో, ఏది ఆదర్శనీయమైనదో దాన్ని దర్శిస్తారు.ఆ క్రమంలో అప్పటికి జనాల్లో ఆ కళకు ఉన్న స్థితికి అతీతంగా వ్యవహరిస్తారు. అ మహోన్నత కళాకారులు కళా ప్రమాణాల్ని ప్రతిష్ఠిస్తారు. అలాంటి కళాకారులలో ఒకరు గాయకులు జీ.ఎన్. బాలసుబ్రమణియన్ ఒకరు; ప్రముఖులు.
మంచి గాత్రం జీ.ఎన్. బాలసుబ్రమణియన్ గాత్రం
పురుష గాత్రం. సాహిత్యం పాడడంలో అసహజత్వం ఉండేది కాదు. ఆయన గాత్రంలో, గానంలో జిడ్డు ఉండేది కాదు. సంగతులు చురుగ్గా వేసేవారు. ఆప్పట్లో నిస్తేజంగా, కృతకంగా ఉండే కర్ణాటక గానానికి ఆయన జీవాన్ని, సహజత్వాన్ని తీసుకు వచ్చారు. ఈనాటి కర్ణాటక గానానికి ఆయన ఒక పునాది.
జీ.ఎన్.బీ. లేదా జీ.ఎన్. బాలసుబ్రమణియన్ ‘లయ’ ప్రధానంగా పాడేవారు. ఆయనది సృజనాత్మక ఫణితి. దీర్ఘ గమకాలు కాకుండా హ్రస్వ గమకాలతో ఆకర్షణీయంగా పాడేవారు. సంగతుల్ని చాల వేగవంతంగా వేసేవారు.
జీ.ఎన్.బీ. చలనచిత్ర కథానాయక నటుడు కూడా. ఎమ్.ఎస్. సుబ్బులట్చుమి నాయిక అయితే జీ.ఎన్.బీ. నాయకుడై స(శ)గున్దలై (1940) అన్న తమిళ్ష్ సినిమా వచ్చింది. 1934 నుంచి 1947 వరకూ నాలుగు సినిమాలు చేశాక నటనను విడిచి పూర్తిగా కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయకుడుగా స్థిరపడ్డారు; కర్ణాటక శాస్త్రీయ సంగీతం స్థిరత్వాన్ని సాధించడానికి దోహదపడ్డారు.
అరియక్కుడి రామానుజ అయ్యంగార్ స్ఫూర్తికాగా జీ.ఎన్.బీ. గొప్పగాయకుడిగా చరిత్ర సృష్టించారు. జీ.ఎన్.బీ. 200పైగా కృతుల్ని రాశారు. వాటిల్లో ఎక్కువ శాతం తెలుగు కృతులు! రాగ ద్రష్ట, స్రష్ట జీ.ఎన్.బీ.
జాన్ బీ. హిగిన్స్ లాంటి ఇంగ్లిష్ వ్యక్తి ప్రముఖ కర్ణాటక సంగీత గాయకుడవడానికి జీ.ఎన్. బాలసుబ్రమణియన్ గాన ధోరణి ప్రేరణ; కారణం. జీ.ఎన్.బీ. గానకళకే కళ అయ్యారు.
– రోచిష్మాన్
9444012279