November 13, 2026

ఇంటర్ రద్దుతో అసలు లబ్ధిదారులు నారాయణ, శ్రీ చైతన్య సంస్థలే

  • ఇంటర్మీడియట్ రద్దు ఎవరి కోసం?
  • మంత్రివర్గ నిర్ణయం లేదు.. బిల్లు లేదు
  • ఈ నిర్ణయం తెలంగాణ బిడ్డల కోసం కాదు, కుటుంబ వ్యాపారం కోసం
  • సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ను రద్దు చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డిది తుగ్లక్ నిర్ణయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. కేవలం నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ కాలేజీలకు లబ్థి చేకూర్చేందుకే ఇంటర్ రద్దు చేశారని ఆరోపించారు. ఆమేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు.

శ్రవణ్ ఇంకా ఏమన్నారంటే..మంత్రివర్గ నిర్ణయం లేదు, బిల్లు లేదు, చర్చ లేదు: ఒక్క సమీక్షా సమావేశంతో ఇంటర్ రద్దు అప్రజాస్వామికం. 10 లక్షల విద్యార్థులు, 1,750 జూనియర్ కళాశాలల భవిష్యత్తు ఒక్క గదిలో తేల్చేశారు. ఇది తుగ్లక్ నిర్ణయం, నియంతృత్వ పాలన. ఇంటర్ రద్దుతో అసలు లబ్ధిదారులు నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ సంస్థలే. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థి కార్పొరేట్ క్యాంపస్‌లలోనే బందీ.

ఇంటర్ మాత్రమే నడిపే ప్రైవేట్ కాలేజీలు మూతపడే ప్రమాదం. సీఎం కుటుంబ సభ్యులే కొత్తగా పాఠశాలలు స్థాపిస్తున్నారనే ఆరోపణలు. ఈ నిర్ణయం తెలంగాణ బిడ్డల కోసం కాదు, కుటుంబ వ్యాపారం కోసం.

దేశ జనాభాలో 3% ఉన్న తెలంగాణ, జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హుల్లో 9.6% వాటాతో దేశంలో మూడో స్థానం. జేఈఈ మెయిన్ 100 పర్సంటైల్‌లో వరుసగా మూడేళ్లు తెలంగాణే టాప్. ఇంటర్ రద్దుతో మన బిడ్డల ఐఐటీ, ఎన్‌ఐటీ సీట్లు ఇతర రాష్ట్రాలకు. మే 10న ఇచ్చిన మూడు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. విద్యా కమిషన్ నివేదిక ఇప్పటికీ సభలో పెట్టలేదు. ఖర్చులేని రద్దు సిఫార్సు మాత్రమే ఎంచుకున్నారు. జూనియర్ కాలేజీ ప్రవేశాలు 14% పెరిగి 85,453కు; ఇంటర్ కుప్పకూలలేదు. విస్తరిస్తోంది.

విద్యకు 15% బడ్జెట్ హామీ; ఇచ్చింది 8.23% మాత్రమే. 2026-27 ఒక్క ఏడాదిలోనే విద్యా బడ్జెట్ లోటు రూ. 21,961 కోట్లు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 97% ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీ. 19,017 టీచర్ పోస్టులు ఖాళీ; 2024 తర్వాత డీఎస్సీ లేదు. యూనివర్సిటీలకు రూ. 500 కోట్లు కేటాయించి, ఇచ్చింది రూ. 5 కోట్లు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 8,591 కోట్లు; కాలేజీల లెక్కన రూ. 10,000 కోట్లు. ఒక్క ఏడాదిలో 1,441 ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు. గురుకుల టెండర్లలో రూ. 4,000 కోట్లకు పైగా అక్రమాల ఆరోపణలు ఢిల్లీలో ఎన్ఈపీని బుల్డోజర్ అంటారు. హైదరాబాద్‌లో అదే బుల్డోజర్ నడుపుతారు. కర్ణాటక, తమిళనాడు ఎన్ఈపీని తిరస్కరిస్తే, తెలంగాణలో ఆదేశంతో రుద్దుతున్నారు. 5వ తరగతి పిల్లలను “సెకండరీ” విద్యార్థులుగా మార్చిన ఏకైక ప్రకటన ఇదే.

1971 ఇంటర్ విద్యా చట్టాన్ని ఆదేశంతో రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. ఆ అధికారం శాసనసభదే. కేంద్ర నిధుల షరతులకు తలొగ్గి ఐదు దశాబ్దాల విద్యా వారసత్వాన్ని బలి ఇవ్వొద్దు.

నవంబర్ 11 ఆదేశాన్ని తక్షణమే నిలిపివేయాలి. సీఎం కుటుంబానికి వాటా ఉన్న విద్యాసంస్థల వివరాలు బహిర్గతం చేయాలి. ఇంటర్ విద్యపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉభయ సభల్లో చర్చ జరపాలి, ఆర్డినెన్స్ వద్దు. స్వతంత్ర నిపుణుల కమిటీ వేయాలి. ఇంటర్ భవిష్యత్తును నిర్ణయించాల్సింది శాసనసభ; సీఎం, ఆయన చుట్టూ ఉన్న అధికారులు కాదు.

Total Visitors: 3,425,967