November 14, 2026

రాహుల్.. చాయ్ తాగుదాం రండి!

  • అశోక్‌నగర్‌లో ఉస్మానియా విద్యార్ధుల వినూత్న నిరసన
  • రాహుల్‌కు కుర్చీ వేసి దానిపై రాహుల్ ఫొటో

హైదరాబాద్: కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు అశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చి, తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన రేవంత్ సర్కారుపై నిరుద్యోగులు, విద్యార్ధులు రోజూ రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో వినూత్న నిరసన ప్రనర్శనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా భారత్ సమ్మిట్‌కు నగరానికి వచ్చిన రాహుల్ గాంధీని.. అదే అశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చి, తమతో చాయ్ తాగాలంటూ ఉస్మానియా విద్యార్ధులు, టీఆర్‌ఎస్వీవీ నాయకులు నిర్వహించిన వినూత్న నిరసన అందరినీ ఆకట్టుకుంది.
రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, బీఆర్ఎస్వీ నాయకులు వినూత్న నిరసన చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

ఎన్నికల సమయంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్‌లోని టీ స్టాల్ వద్ద నిరుద్యోగ యువతతో కలిసి చాయ్ తాగిన రాహుల్ గాంధీ, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని విద్యార్థి నాయకులు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు భర్తీ చేయాల్సిన 6 లక్షల ఉద్యోగాల ఊసే లేదని, కనీసం 10 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు.

భారత్ సమ్మిట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ నేరుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ వద్దకు వచ్చి నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగాలని, 6 లక్షల ఉద్యోగాల హామీపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ సందర్భంగా అశోక్ నగర్‌లో ఒక కుర్చీని ఏర్పాటు చేసి, దానికి రాహుల్ గాంధీ ఫోటో అతికించి, బీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్, నాగేందర్‌లతో పాటు పలువురు విద్యార్థులు చాయ్ తాగుతూ నిరసన వ్యక్తం చేశారు.

Total Visitors: 3,424,831