బిజెపి డిమాండ్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీల పనితీరును సమీక్షించడంతో పాటు, రాష్ట్ర కమిటీ సభ్యులకు అప్పగించిన బాధ్యతలపై గత నాలుగు నెలల ఫలితాలను పరిశీలించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థంగా వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే అనుబంధ విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. బీజేపీ అగ్రనేతలతో కలిసి రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున మొత్తం ఐదు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సింగరేణి, నైనీ కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచీ ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాలనేది బీజేపీ డిమాండ్ అని స్పష్టం చేశారు. అలాగే దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో, వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు స్పష్టంగా చూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటివరకు రెండు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.