January 22, 2026

100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌

– రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. 4వేల మందికి ఉపాధి
– యూపీసీ వోల్ట్‌తో తెలంగాణ ఒప్పందం

దావోస్‌: తెలంగాణను దేశంలోనే ఏఐ డేటా సెంటర్ల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్‌’ బృందం దావోస్‌లో యూపీసీ వోల్ట్‌ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా యూపీసీ వోల్ట్‌ సీఈవో హాన్‌ డీ గ్రూట్‌, యూపీసీ రిన్యూవబుల్స్‌ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్‌ జ్వాన్‌, యూపీసీ రిన్యూవబుల్స్‌ ఇండియా సీఈవో అలోక్‌ నిగమ్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్‌ గ్రూప్‌, వోల్ట్‌ డేటా సెంటర్స్‌ కలిసి యూపీసీ వోల్ట్‌ సంస్థగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన అత్యాధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరా కోసం 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా నెలకొల్పనుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే సుమారు 3వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. డేటా సెంటర్‌ పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్‌ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. నెట్‌ జీరో సిటీ అభివృద్ధి తెలంగాణ విజన్‌లో కీలక భాగమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.

Total Visitors: 2,518,115