ఆకాశమంత ధైర్యం: జెన్ జీ స్పూర్తికి ప్రతీక స్మిత్ మచ్చర్

(ఇంద్రాణి)
ఈ మధ్యకాలంలో ‘జెన్ జీ’ అనే పదం ఎక్కువగా వినిపిస్తున్నది. అయితే యువతరం మీద ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వెలిబుచ్చుతూ ఉంటారు. సామాజిక స్పృహ లేదని ఒకరంటే, ఇంట్లో కూడా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు అని మరొకరు అంటూ ఉంటారు. ముఖ్యంగా కష్టం విలువ వారికి అర్థం కావటం లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. సమస్య వస్తే తట్టుకొనే శక్తి వారికి లేదు అనేది మన ప్రధానమైన ఆరోపణ.
రెండు, మూడు సంవత్సరాల నుండి జెన్ జీ ఉద్యమాలు చూస్తున్నాం. నేపాల్‌లో ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తివంతమైన ఉద్యమంలో ఫలితం వచ్చినా, హింస చెలరేగటాన్ని జెన్ జీకి ఆపాదించారు. బంగ్లాదేశ్‌లో యువత ఉద్యమించినప్పుడు ఆ నిమిషానికి వచ్చిన ఆవేశంతో అల్లర్లు చేశారు కానీ, ఆ ఉద్యమానికి లక్ష్యం లేదు అన్నారు. కానీ అవి ఆ దేశాల ప్రభుత్వాలను పడగొట్టగలిగాయి. మన భారత ప్రధాన న్యాయమూర్తి యువతను ఉద్దేశించి బొద్దింకలు అన్నందుకు, “మేము బొద్దింకలమే” అంటూ అభిజిత్ దీప్కే పెట్టిన వ్యంగ్య పోస్టు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే వేదికను తయారు చేయటమే కాక దేశ యువతను మేల్కొల్పింది. ఒక్క చిన్న పోస్టుతో మొదలైన ఉద్యమం కేంద్ర ప్రభుత్వ మెడలు వంచింది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌ల మాదిరిగా మన జెన్ జీ ఉద్యమంలో హింస చెలరేగలేదు.
అయినా రామచంద్ర గుహ లాంటి వారు సాంప్రదాయ ఆందోళనలకు భిన్నంగా మీమ్స్, డిజిటల్ నిరసనల ద్వారా యువత రాజకీయాలలోకి రావటంపై విశ్లేషిస్తూ—”ఈ డిజిటల్ నిరసనలు వ్యవస్థలోని లోపాలను వేగంగా వెలుగులోకి తెచ్చినప్పటికీ, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి వారి దీర్ఘకాలిక సిద్ధాంతపరమైన పునాది ఉంటేనే ఇవి నిజమైన మార్పుకు దారితీస్తాయి” అని వ్యాఖ్యానించారు. అయితే అవసరం మనిషిని ఆలోచింపజేస్తుంది. ఈరోజు ఆవేశంగా నడిచిన యువత, రేపు మరలా రావాల్సి ఉంటే ఎలా రావాలో ఒక ప్రణాళిక రూపొందించుకుంటుంది. ఈ వ్యాఖ్యానాలలో తప్పు లేదు కానీ, ఈ ఉద్యమాల ద్వారా మనకు అర్థమయ్యేది మాత్రం యువత మనం అనుకుంటున్నట్లు బాధ్యతారాహిత్యంగానో, సమాజ పోకడల గురించి అవగాహన లేకుండానో కాలం గడపటం లేదు.
ఆందోళనలు, నిరసనలలో పాల్గొనటం ద్వారా వారు సంక్షోభ సమయాల్లో స్పందించగలరో లేదో అనే సందేహం మిగిలిపోయి ఉన్నది. సంక్షోభం వస్తే చివరివరకూ నిలబడగలరా లేదా అనే సందేహానికి మన భారతీయ పైలట్ స్మిత్ సమాధానం చెప్పాడు. ఈరోజు ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన ఫ్లైదుబాయ్ విమానంలో సహచరుడు కావించ తలపెట్టిన ఉన్మాదం నుండి ప్రయాణికులను కాపాడిన తీరు భారత యువశక్తికి ప్రతీకగా నిలిచింది.
భూమికి 34,000 అడుగుల ఎత్తులో ఉండగా కో-పైలట్ తనపై కత్తితో దాడిచేసినా, విమానం కంట్రోల్ ఆ ఉన్మాది చేజిక్కకుండా స్మిత్ మచ్చర్ పోరాడిన తీరు అనన్యసామాన్యం. కత్తిపోట్ల వలన తీవ్రంగా రక్తం ఓడుతున్నప్పటికీ కెప్టెన్ స్మిత్ మ్యాచర్ అత్యంత సమయస్ఫూర్తితో కో-పైలట్‌ను నిరోధించారు. ఒకవైపు కో-పైలట్‌ను నిరోధిస్తూనే, మరోవైపు కాక్‌పిట్ డోర్ అన్‌లాక్ చేసి లోపలికి తోటి విమాన సిబ్బంది, ప్రయాణికులు రావటానికి మార్గం సుగమం చేశారు. ఇవన్నీ వారికి ట్రైనింగ్‌లో నేర్పేవే అయినా, ఆపద సమయంలో, అందునా కత్తిపోట్లతో గాయాలపాలైన సమయంలో కూడా చివరి నిమిషం వరకూ ప్రయాణికులను కాపాడేందుకు స్మిత్ మచ్చర్ పోరాడిన తీరు భారత జాతికే గర్వకారణం.
అతగాడు సైనికుడు కాదు, కానీ వీరోచితంగా పోరాడాడు. జీవితాన్ని కాచి వడపోసినవాడు కాదు, కానీ 180 మంది ప్రాణాల కోసం తెగించి కత్తికి ఎదురుగా నిలబడ్డాడు. అన్నిటికంటే మించి ధైర్యం కోల్పోకపోవటం ఆశ్చర్యం కలిగించింది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలలో ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే పైలట్లు ప్రాణనష్టాన్ని నివారించగలిగారు. అది కూడా ఒక కార్గో విమానంలో—అందులో ఉన్న ఫ్లైట్ ఇంజనీర్ కాక్‌పిట్‌లోకి వెళ్లి ముగ్గురు పైలట్లపై హ్యామర్లు, స్పియర్ గన్లతో దాడి చేశాడు. పైలట్లు ముగ్గురూ కలిసి అతడిని లొంగదీసుకున్నారు. అక్కడ ముగ్గురు పైలట్లు ఉన్నారు, గాయపరచిన వ్యక్తి పైలట్ కూడా కాదు; అందుకని విమానం వారి కంట్రోల్‌లోనే ఉన్నది.
2015 లో స్పెయిన్ నుండి జర్మనీ వెళ్తున్న విమానంలో పైలట్ వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో, కో-పైలట్ లోపల డోర్ లాక్ చేసుకుని విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లోకి తీసుకెళ్లి కూల్చివేశాడు. ఆ దుర్ఘటనలో 150 మంది మరణించారు. ఆ సంఘటన తరువాతే కాక్‌పిట్‌లో ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు ఉండాలనే నిబంధనను ప్రపంచవ్యాప్తంగా కఠినతరం చేశారు. మరో సంఘటనలో ఇండోనేషియా నుండి సింగపూర్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ బయటకు వెళ్లిన సమయంలో కెప్టెన్ కాక్‌పిట్‌ను లాక్ చేసి, ఫ్లైట్ డేటా రికార్డర్లను డిస్కనెక్ట్ చేసి విమానాన్ని నదిలో కూల్చివేశాడు; 104 మంది ప్రయాణికులు మరణించారు.
న్యూయార్క్ నుండి కైరో వెళ్తున్న విమానంలో కూడా కెప్టెన్ కాక్‌పిట్ వదిలి వెళ్లగానే కో-పైలట్ ఆటోపైలట్‌ను ఆపివేసి విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలోకి మళ్లించాడు. కెప్టెన్ లోపలికి వచ్చి విమానాన్ని నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు; 217 మంది ప్రయాణికులు మరణించారు. మొజాంబిక్‌లో జరిగిన ఇలాంటి ప్రమాదంలోనే 33 మంది ప్రయాణికులు మరణించారు. ఒకసారి విమానం గాల్లో ఉన్న సందర్భాలలో పైలట్లు ఉన్మాదానికి, డిప్రెషన్‌కు గురయ్యారంటే ప్రయాణికుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయిన సందర్భాలే కనిపిస్తున్నాయి.
ఫ్లైదుబాయ్‌లో కూడా ప్రయాణికుల పరిస్థితి అలాగే ఉండేదేమో! స్మిత్ మచ్చర్ కాక్‌పిట్‌ను అన్‌లాక్ చేయటమే ప్రయాణికులను కాపాడింది. మరణాలు సంభవించిన విమానాలలో కూడా పైలట్లు తమ సర్వశక్తులూ ఒడ్డారు, కానీ కాపాడలేకపోయారు. స్మిత్ మచ్చర్ కూడా కో-పైలట్‌ను లొంగదీసుకునే ప్రయత్నం ఒక్కటే చేసి ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశం తక్కువగా ఉండేది. సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయమే తనను, ప్రయాణికులను కాపాడింది. ఏది ఏమైనా మన దేశ యువత సంక్షోభం వస్తే బెదిరిపోకుండా ఒక సముచిత నిర్ణయం తీసుకోగలిగే స్థితిలోనే ఉంటారు అనే ధైర్యాన్ని కలుగజేశాడు మన పైలట్ స్మిత్ మచ్చర్. స్మిత్‌కు సౌదీలో శస్త్రచికిత్స చేశారనే వార్తలు వచ్చాయి; మన హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
మన జెన్ జీ ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని మనం కోరుకోవటం ఒక్కటే కాదు; వారు ఎలా ఉంటున్నారో గమనించాలి. కింద పడతారు, దెబ్బలు తగులుతాయి; గాయాలు తగ్గాక మళ్లీ లేచి నిలబడతారు, నడుస్తారు. ఈసారి మరికొంచెం జాగ్రత్తగా నడిచే ప్రయత్నం చేస్తారు. అభిజిత్ దీప్కే లాంటి వారిని గాంధీ, నెహ్రూల మాదిరిగానో, అంబేద్కర్ మాదిరిగానో ఉండాలని మనం కోరుకోకూడదు. మార్క్సిజానికే తమకవసరమైన అద్దకాలు చేస్తున్నారు. కాలం మారినట్లే సమస్యల స్వరూపం కూడా మారుతుంది. దానికి అనుగుణంగా మన యువత నడిచే దారిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటంలో మన మార్గదర్శకత్వం అవసరమైనంతవరకు ఇవ్వవచ్చు కానీ, వారిని అంబాడే దశలోనే నడిపించే ప్రయత్నం చేయకూడదు.
34,000 అడుగుల ఎత్తులో గాలిలో విమానం పల్టీలు కొడుతున్నప్పుడు ఒక యువకుడు తన తోటి ఉద్యోగి చేతిలోని కత్తిని లాక్కుని అతడిని కత్తితో పొడిచి గాయం చేసో, చంపేసో విమానాన్ని కాపాడాలి అనే ఆప్షన్‌లోకి వెళ్లకుండా, కాక్‌పిట్ తలుపు తెరవాలనే ఆప్షన్ ఎంచుకున్నాడు; విజయం సాధించాడు. గాంధీ గారి అహింస ఒక్కటే ఈ దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించలేదు; భగత్ సింగ్ వంటి విప్లవ వీరుల త్యాగాల ఫలితం కూడా ఉన్నది.
మన యువతపైన విశ్వాసాన్ని ఉంచుదాం. హింసకు అర్థం మారిపోయిన ఈ రోజుల్లో కనిపించని హింసను అమలు చేసేవారిని కట్టడి చేయగలిగే శక్తి మన యువతకు ఉన్నది అని విశ్వసించటం ఒక్కటే మన బాధ్యత. మరొక్కసారి మన యువకిశోరం స్మిత్ మచ్చర్ కు జేజేలు పలుకుదాం!
