తక్కువ పనితీరు కంపెనీల జోన్ల రద్దు : మంత్రి తుమ్మల
హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ దిశగా నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోని ఆయిల్‌పామ్ కంపెనీల జోన్లను ఎలాంటి సంకోచం లేకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు. సచివాలయంలో గురువారం టీజీ ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదని పేర్కొన్న మంత్రి, అక్కడ పనిచేస్తున్న తక్కువ పనితీరు కనబరుస్తున్న కంపెనీల జోన్లను రద్దు చేసి, ఆసక్తి గల ఇతర సంస్థలకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కరీంనగర్, ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో లక్ష్యాలు చేరుకోని ప్రైవేట్ ఆయిల్‌పామ్ కంపెనీల జోన్లను రద్దు చేసి ఆయిల్‌ఫెడ్‌కు అప్పగించినట్టు గుర్తుచేశారు.
అవసరమైతే ఆయిల్‌ఫెడ్ జోన్లను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్ సాగులో ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచేందుకు ఆటోమేటెడ్ డ్రిప్ సిస్టంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన పనిముట్లను వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగం చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. దీంతో రైతులపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.
దిగుబడి పెంపు కోసం ట్రైకోడర్మా, గానోడెర్మా నిరోధక బయోఫర్టిలైజర్లు, మెగ్నీషియం, సల్ఫర్ తదితరాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు అందించాలని ఆయిల్‌ఫెడ్ ఎండీకి సూచించారు. పామ్ ఆయిల్ రైతుల కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను అందుబాటులోకి తేవాలని చెప్పారు. కల్లూరుగూడం, బీచుపల్లి ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఆయిల్‌పామ్ రైతుల ఆర్థిక భద్రత కోసం పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 16.5 శాతం నుంచి గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కోరుతూ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్‌సింగ్ చౌహాన్, పియూష్ గోయల్‌లకు లేఖలు రాసినట్టు మంత్రి తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే టెండర్లు పిలిచి విక్రయించాలని అధికారులను ఆదేశించారు. పాత పద్ధతులను విడిచిపెట్టి ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రొక్యూర్‌మెంట్, స్టోరేజీ విధానాలను రూపొందించాలని సూచించారు.
గోదాముల్లో ఎక్కువకాలం నిల్వ చేయకుండా మంచి ధర వచ్చినప్పుడే విక్రయించాలన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన, అధిక దిగుబడి వచ్చే విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ కంపెనీలకు దీటుగా ప్రభుత్వ సంస్థలు విత్తనోత్పత్తి చేయాలన్నారు. సీజన్‌కు ముందే సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి అవసరమైన మేర విత్తనాలను సిద్ధం చేయాలని, రైతుల్లో నమ్మకం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆయిల్‌ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థల ఎండీ యాస్మిన్ బాషా తదితర అధికారులు పాల్గొన్నారు.