-అమరావతి ఈ అదృష్టం తలుపు తడుతుందా?
– “బ్లాక్ స్టోన్ పెట్టుబడి పెట్టిందంటే, ఆ రాష్ట్రం వ్యాపారానికి అనుకూలమని ప్రపంచ దేశాలకు సంకేతం వెళ్తుంది”.
ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్ సదస్సులో భాగంగా 2026, జనవరి 22న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రపంచపు అతిపెద్ద ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్ స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ ఎ. స్క్వార్జ్‌మాన్‌తో జరిపిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 100 లక్షల కోట్ల రూపాయల (మనదేశ ఏడాది బడ్జెట్ 50 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న బ్లాక్ స్టోన్ వంటి దిగ్గజ సంస్థ, ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అంటే ఆ ప్రాంతపు ఆర్థిక ముఖచిత్రం మారిపోవడమే.
ఇప్పటికే భారతదేశంలోని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో భారీ డేటా సెంటర్లు, ఐటీ పార్కులు మరియు మాల్స్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేసిన ఈ సంస్థను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళించేందుకు మంత్రి లోకేష్ పక్కా వ్యూహంతో అడుగులు వేశారు.
ఈ సమావేశంలో భాగంగా విశాఖపట్నంలో ‘గ్రేడ్-ఏ’ ఆఫీస్ స్పేస్‌లు, ఇంటిగ్రేటెడ్ మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు మరియు హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేకంగా చర్చించారు. విశాఖకు ఉన్న తీరప్రాంత కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు స్కేలబుల్ విద్యుత్ లభ్యతను ప్రధానంగా ప్రస్తావిస్తూ, చెన్నై-బెంగళూరు (CBIC), విశాఖ-చెన్నై (VCIC) ఇండస్ట్రియల్ కారిడార్ల వెంబడి లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయాలని కోరారు.
ముఖ్యంగా రాజధాని అమరావతిలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ స్థాయి రిటైల్ మాల్స్ మరియు బహుళ వినియోగ వాణిజ్య సముదాయాల ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్, తాము ఇప్పటికే నవీ ముంబైలో సుమారు రూ. 20,000 కోట్లతో భారీ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నామని గుర్తుచేస్తూ, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను కూడా సీరియస్‌గా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
బ్లాక్ స్టోన్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ ఏపీలో అడుగుపెడితే, అది కేవలం వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు (FDI) తీసుకురావడమే కాకుండా, రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగాల సృష్టికి మరియు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విశ్వసనీయత పెరగడానికి దోహదపడుతుంది.
ఈ భేటీ ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాప్‌లో మరోసారి హైలైట్ చేస్తూ, పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.