నిద్రపట్టని రాత్రిలో మెలకువలో ఒంటరివాణ్ణై
కవిత రాయాలని కూర్చున్నాను.
తలపుల్ని పిలిచాను,
పదాల్ని పఱిచాను,
ప్రయత్నం చేశాను.
వచ్చిన ఫలితం రాత్రిలాగా అస్పష్టంగా ఉంది.
నాకు నేను నచ్చనట్టుగా
నా రచనా నాకు నచ్చలేదు.
నాకు నేను నచ్చాలని
చాల కాలంగా అలమటిస్తున్నాను;
ఆ పని జరగడం లేదు.
నా రచనా కవితవడం లేదు.
ఒంటరితనం ఉంది కదా అని
కళ్లెత్తి ఆపై తలెత్తి
ఇంటి పైకప్పును చీల్చుకుంటూ
ఆకాశం వైపుకు చూశాను.
ఇక్కడున్నామని ఎక్కడో ఉన్న నక్షత్రాలు మిలమిలలాడాయి;
అక్షరాలకందని నక్షత్రాలు
ఎత్తులో ఎంతో ఎత్తులో ఉన్నాయి.
అక్షరాలకు అందనివే
ఎత్తులో, ఎంతో ఎత్తులో ఉంటాయోమో?
నా ఎత్తు ఏమిటో, ఎంతో చూసుకుందామని
నా లోతుల్లోకి కళ్లు దించుకున్నాను.
నా లోపలి లోతుల్లో ఎక్కడైనా
నేను అక్షరాల్ని పరిత్యజించిన వేళల్లో
నక్షత్రాలు మిలమిలాడతాయోమో?
అప్పుడు నాకు నేను నచ్చుతానేమో?
అప్పుడు నా రచనా కవితవుతుందేమో?
నేను ఒక్కసారైనా తళుక్కుమంటానేమో?!
– రోచిష్మాన్
9444012279