– ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ని అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవాన్ని సంఘ్‌లో భాగం కావడం ద్వారానే పొందాలని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశా రు.
ప్రారంభించి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఏ సంస్థ అయినా ఉత్సవాలు చేసుకుంటుందని, కానీ స్వయంసేవకులు అలా ఆలోచించక, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అనే సంఘ కార్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకుని పలు కార్యక్రమాల యోజన చేశారని ఆయన తెలిపారు.
సంఘ కార్య శతాబ్ది సందర్భంగా హైదరాబాదులో “100 ఏళ్ళ సంఘ్ యాత్ర – కొత్త ఆశయాలు” పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సంఘ్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, సంఘ్ లాంటి పని సమాజంలో మరొకటి లేదని చెప్పారు. ఒకవేళ పైపైన అర్థం చేసుకుంటే తప్పుగా కూడ అర్థం కావొచ్చని అప్రమత్తం చేశారు.
“సంఘ్ మొదటి సిద్ధాంతం ఉత్తమ దేశ నిర్మాణం లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం చేయడం. ఇదే ముఖ్యమైన పని. దీని మీదే ధ్యాస సంఘ్ ఉంచుతుంది. ఏ వ్యక్తినైతే నిర్మాణం చేస్తామో, ఆ వ్యక్తి అలాగే ఉండాలి కూడా. ఈ కార్యం ఎక్కువ సమయం తీసుకునేది, అలాగే కేంద్రీకృతంగా జరిగే పని. అందుకే వ్యక్తి నిర్మాణం అన్న ఒకే ఒక విషయంపై కేంద్రీకృతమై, సంఘ్ పనిచేస్తోంది. ఈ పని తప్ప, మరో పని చేయాల్సిన అవసరం సంఘ్‌కి లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు దేశవ్యాప్తంగా 1.30 లక్షలకు పైగా చిన్నా పెద్ద సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారని, సమాజం నుంచి కూడా సహాయాన్ని తీసుకోగా మిగిలిన కార్యం కోసం అవసరమైనవి వారే భరిస్తూ పని కూడా పూర్తి చేస్తారని చెబుతూ ఆయన సంఘ కార్యశైలిపై అవగాహన కల్పించారు. “సంఘ్ సేవా సంస్థ కాదు. సంఘ్ స్వయంసేవకులు పథ సంచలన్ చేస్తారు. అచ్చు మిలటరీ తరహాలోనే క్రమశిక్షణగా చేస్తారు. కానీ సంఘ్ పారా మిలటరీ సంస్థ కూడా కాదు” అని తెలిపారు.
“నిత్య శాఖలో లాఠీ శిక్షణలాంటివి ఇస్తారు. కానీ ఇదేమీ శారీరిక్ అఖాడా కాదు. అలాగే సాంఘీక్ గీత్, వ్యక్తిగత గీత్ తో పాటు బ్యాండ్ కూడా ఉంటుంది. కానీ సంఘ్ సంగీత సంస్థ కాదు. పైపై మాటలను చూసి, సంఘ్‌ను అర్ధం చేసుకుంటే తప్పుగా అర్థమవుతుంది” అని ఆయన హితవు చెప్పారు.
కళారంగం మొదలు రాజకీయ క్షేత్రం వరకూ అన్ని రంగాల్లోనూ స్వయంసేవకులు ఉన్నారని, కొందరు స్వయంసేవకులు స్వయంగా ఆ రంగాలను నడుపుతుంటే, మరికొందరు ఎప్పటి నుంచో ఉన్న రంగాల్లో భాగస్వాములై నేడు అగ్రభాగంలో ఉన్నారని ఆయన వెల్లడించారు. వీరిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంఘ్ నియంత్రించదని, పూర్తి స్వయంప్రతిపత్తితో వారు పనిచేస్తుంటారని వివరించారు.
సంఘ్ భావజాలంతో, సంఘ్ ఇచ్చిన సంస్కారాల ఆధారంగా ఆ పనులన్నీ చేసేది స్వయంసేవకులే అయినప్పటికీ ఈ పనులన్నింటినీ చూడటం ద్వారా ఎవరూ సంఘ్‌ని అర్థం చేసుకోలేరని కూడా ఆయన స్పష్టం చేశారు.
స్నేహం, ప్రేమ ఆధారంగానే సంఘ కార్యం నడుస్తుందని, ఇచ్ఛాపూర్వకంగా, వివేకంతో స్వయంసేవకులు పనులు చేస్తారని డా. భగవత్ చెప్పారు.
దేశాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రజల కోసం పనిచేసే కొన్నిసంస్థలు లేదా కొందరి పనే మాత్రమే అని అనుకుంటారని, అయితే ఈ స్వభావాన్ని మార్చి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని ఉద్బోధించడమే సంఘ్ పని అని ఆర్ఎస్ఎస్ దృష్టికోణాన్ని ఆయన వివరించారు. పార్టీలు, ప్రభుత్వాలు, నేతలు, మహా పురుషులు పోషించేది సహాయక పాత్ర మాత్రమేనని, సమాజమే యజమాని అని తేల్చి చెప్పారు.
సమాజంలో ఏకత, గుణాత్మకత వచ్చేవరకూ దేశ భవితవ్యం మారదని, మారకుంటే మనం ప్రమాదంలో పడినట్లేనని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వ్యక్తి నుంచి వ్యవస్థ వరకూ దేశ సమగ్ర ఉన్నతి లక్ష్యంగా సంఘ్ ఆశిస్తున్న పంచ పరివర్తన్ గురించి వివరించారు. ఇందులో భాగాలైన 1.కుటుంబ ప్రబోధన్ (భజన్, భోజన్, భాష, భూష, భవన్, భ్రమణ్) 2.పర్యావరణ పరిరక్షణ 3.సామాజిక సమరసత 4.స్వదేశీ 5. పౌరవిధుల గురించి పరిచయం చేశారు.
నేడు హిందూ సమాజంలో తాము హిందువులమని గర్వించేవారు, హిందువులమని వ్యక్తిగతంగా మాత్రమే అంగీకరించేవారు, హిందువుగా జీవిస్తున్నప్పటికీ బయటకు వ్యక్తం చేయనివారు, అసలు హిందువులమన్న మూలాలనే మరచినవారు… ఇలా భిన్న వర్గాలున్నాయని డాక్టర్ మోహన్ భాగవత్ తెలియజేశారు.
అందరమూ ఒకే సంస్కృతికి చెందినవారం కాగా, అందరిలోనూ ఉమ్మడిగా ఈ చైతన్యం మేల్కొనేలా చేయడం నేడు సమాజం ముందున్న బాధ్యత ఆయన చెప్పారు.
సభికుల ప్రశ్నలకు బదులిస్తూ సమీపంలోని సంఘ శాఖ లేదా సంఘ ప్రేరిత సంస్థల ద్వారా నేరుగా ఆ పని చేయవచ్చని, అయితే సంఘ్ చేసే పనిని వ్యక్తిగతంగా చేస్తున్నవారు కూడా అంతే గౌరవనీయులంటూ తనను సంఘ్ ప్రేరితునిగా పేర్కొన్న భూదానోద్యమ మూలపురుషులు వినోభా భావేని డాక్టర్ భాగవత్ ప్రస్తావించారు.
భారత్ – అంతర్జాతీయ సంబంధాల గురించి ఒక ప్రశ్నకు స్పందిస్తూ ఏ దేశమైనా తమ జాతీయ ప్రయోజనాల మేరకే అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహిస్తుంటుందని, భారత్ కూడా ఈ విషయంలో రాజీలేని ధోరణినే అవలంబించాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ పరిణామాలతో వ్యవహరించాలంటే ఏ దేశమైనా ఆర్ధికంగా, సామాజికంగా శక్తిమంతమై ఉండాలని చెప్పారు.
ప్రపంచంలో ఎంత అలజడి ఉన్నప్పటికీ మన దేశంలో సామాజిక బాధ్యతతో కూడిన బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా వాటి ప్రభావం మనపై అత్యల్పమని తెలిపారు. అంతర్గత భద్రతా సవాల్ విసురుతూ భారత్‌లోకి జరుగుతున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యా చొరబాట్ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్రమంగా వచ్చినవారిని గుర్తించడం, నిర్బంధించడం, తిప్పిపంపడం ప్రభుత్వ విధులే అయినప్పటికీ, పౌరులు సైతం బాధ్యతతో వ్యవహరించి ఇలాంటివాటిని అధికారులు, భద్రతా వ్యవస్థల దృష్టికి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు.
దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళేందుకు సమాజ పరివర్తన జరగాలని, ఇందుకు అందరి సహాయ సహకారాలు కావాలని హైదరాబాద్ కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ మోహన్ భాగవత్ గారిని కలుసుకున్న వివిధ రంగాల ప్రముఖులు, మేధావులను ఆయన కోరారు.
సమాజాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న ప్రముఖులు, ఆదర్శ వ్యక్తులు స్వయంఉదాహరణగా నిలిచి తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇటువంటివారిని చూసి సమాజం మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.