– ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 9వసారి ప్రవేశపెట్టిన జాతీయ బడ్జెట్ 2026-27 తెలంగాణ ప్రజలను మరోసారి నిరాశపరిచిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం 54.1 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టి కూడా ఇందులో తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో ఆవేదన చెందారు.తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి ఈ బడ్జెట్ ప్రబల నిదర్శనమన్నారు.దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న తెలంగాణకు ఈ బడ్జెట్లో కూడా తీవ్ర అన్యాయం జరగడం బాధాకరమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
రాష్ట్ర ఏర్పాటు జరిగి 12 ఏండ్లు దాటిన విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేరకపోవడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్),మెట్రో రైలు మార్గం విస్తరణ,సాగునీటి ప్రాజెక్టులకు పైసా కూడా కేటాయించకపోవడం విచారకరమని ఎంపీ రవిచంద్ర అన్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఏం),నవోదయ, సెంట్రల్ స్కూల్స్ ఏర్పాటు ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదన్నారు.రైతుల సంక్షేమం, ఉద్యోగాల కల్పన గురించి ఎటువంటి హామీలు కూడా బడ్జెట్లో పేర్కొనకపోవడం అభ్యంతరకరమన్నారు. కాంగ్రెస్,బీజేపీలకు రాష్ట్రం నుంచి 8+8 మంది లోకసభ సభ్యులు ఉన్నా, అందులో ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నా బడ్జెట్లో తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష నెలకొనడం బాధాకరమని ఎంపీ వద్దిరాజు అన్నారు.