– 53 రోజుల జీవితాన్ని దొంగిలించిన జగన్ ప్రభుత్వం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు ముఖ్యమంత్రులుగా పరిపాలించారని, ఆ కాలమంతా అధికార–ప్రతిపక్షాల రాజకీయ పోటీ మాత్రమే జరిగిందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.
గతంలో రెడ్డి, బ్రాహ్మణ, దళిత, వెనుకబడిన వర్గాలు, వైశ్య, వెలమ, కమ్మ వర్గాలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడంలో, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వాలు పోటీ పడ్డాయని చెప్పారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కక్ష, కార్పణ్యం, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామిక చర్యలు, రాజ్యాంగ విరుద్ధ పాలన, అవినీతి చోటు చేసుకున్నాయి.
వీటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఈ కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో తప్పుడు కేసు నమోదు చేసి 53 రోజులు జుడిషియల్ కస్టడీకి పంపి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించారు.
సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసిన నిధులు చంద్రబాబు నాయుడుకి గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ, ఆయనకు సంబంధించిన ఖాతాలకు గానీ వెళ్లలేదని ఆయన ఎన్నిసార్లు స్పష్టం చేసినా జగన్ రెడ్డి వినకుండా రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా భావించి ఏదైనా సరే అరెస్ట్ చేయాలన్న దురుద్దేశంతో చంద్రబాబు నాయుడుని జైలులో పెట్టారు.
సీఐడీ దర్యాప్తులో డిజైన్‌టెక్‌కు చెల్లించిన నిధులు ఏ ప్రజాసేవకుడికి గానీ, చంద్రబాబు నాయుడు కి గానీ, ఇతర నిందితులకు గానీ వెళ్లలేదని, ప్రతి రూపాయి అకౌంటెడ్ అని స్పష్టంగా తేల్చిందన్నారు. అందువల్ల ఈ కేసును “మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్” కింద కేసు వాపస్ తీసుకున్నారు. అదే విధంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఈ కేసులో చంద్రబాబుకి ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు జీవితంలో 53 విలువైన రోజుల కాలాన్ని జగన్ రెడ్డి తన కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేశారు. జైల్లో కనీస సౌకర్యాల కోసం కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించి కక్ష రాజకీయాలకు దారితీశారు. చంద్రబాబు జైలులో ఉన్న 53 రోజుల్లో ఆయన రాష్ట్రానికి చేసిన సేవను రాష్ట్ర ప్రజలందరూ గుర్తుచేసుకున్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు చూశారు. శాసనసభలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రజలే 11 సీట్లతో తీర్పనిచ్చారు. తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు జీవితంలో 53 రోజులు దొంగిలించడం నేరం. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన సమయంలో నిజాయితీపరుడైన నాయకుడిని ఎందుకు జైలులో పెట్టారని ప్రపంచవ్యాప్తంగా అరెస్టుకు వ్యతిరేకంగా 108 దేశాల్లో నిరసనలు చేశారు.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి నైతిక విలువలు ఉంటే చంద్రబాబు నాయుడుకి, ఆయన కుటుంబానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.