సాధారణంగా తీపి పదార్థం కనిపిస్తే “షుగర్ ఉంది వద్దు” అని వారించే వారు కూడా, ‘శ్రీవారి ప్రసాదం’ అనగానే భక్తితో కళ్ళకు అద్దుకుంటారు. ఎందుకంటే అది కేవలం తినుబండారం కాదు, కోట్లాది మంది హిందువుల విశ్వాసం. లడ్డూ ప్రసాదం అంటే స్వామివారి ఆశీస్సులకు ప్రతిరూపం. కానీ, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమృత ప్రసాదంపై జరిగిన అపచారం నేడు యావత్ హిందూ సమాజాన్ని కలచివేస్తోంది.
తిరుమల ఆలయ చరిత్ర నేటిది కాదు. క్రీస్తుపూర్వం 300 నాటి ‘తొలకప్పియం’ నుంచి మొన్నటి విజయనగర చక్రవర్తుల వరకు ఈ క్షేత్రం అజేయంగా నిలిచింది. ఉత్తర భారతంలో అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలు విదేశీ దండయాత్రలకు గురై శిథిలమైనా, తిరుమల మాత్రం సురక్షితంగా ఉంది.
ఏడుకొండలు భౌగోళికంగా రక్షణ ఇస్తే, ప్రాణాలకు తెగించి పోరాడిన చక్రవర్తుల నుండి విజయనగర రాజుల పరాక్రమం వరకు ఆ పవిత్రతను నిలబెట్టింది. చివరకు బ్రిటిష్ వారి హయాంలోనూ ఈ ఆలయ పవిత్రత చెక్కుచెదరలేదు. వేల ఏళ్లుగా ఏ శత్రువు చేయలేని అపచారాన్ని, నేడు ‘హైందవ ముసుగు’లో ఉన్నవారే చేశారన్నది చేదు నిజం.
శ్రీవారి లడ్డూలో వాడే శనగపిండి, ఆవు నెయ్యి, యాలకులు, పచ్చ కర్పూరం వంటివి పేద-ధనిక తేడాలేకుండా వచ్చే కోట్లాది మంది భక్తులకు కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని సైన్స్ చెబుతోంది. అటువంటి పవిత్రమైన దినుసుల స్థానంలో, స్వార్థం కోసం అపాయకరమైన పదార్థాలను చేర్చి, ప్రసాదాన్ని విషతుల్యం చేయడం క్షమించరాని నేరం. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం కోసం జరిగిన అవినీతి కాదు; ఒక సంప్రదాయాన్ని, ఒక జాతి నమ్మకాన్ని దెబ్బతీసే “పెద్ద కుట్ర” అని స్పష్టమవుతోంది.
సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) నియమించిన సిట్ (SIT) నివేదికలు నిజానిజాలను వెలికితీస్తున్న తరుణంలో, ఈ ఘోర అపచారాన్ని సమర్థించే వారు కూడా ఆ పాపంలో భాగస్వాములే. ధర్మాన్ని తాకట్టు పెట్టే అటువంటి వారు ‘ముసుగులో ఉన్న ముష్కరులే’. వీరు పాపవినాశనంలో మునిగినా, కాశీలో ప్రాయశ్చిత్తం చేసుకున్నా.. కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచిన పాపకర్మ వీరిని వదలదు.
సహస్ర కాలాల చరిత్ర కలిగిన తిరుమల క్షేత్రం ఎందరో రాజులను, రాజ్యాలను చూసింది. ధర్మానికి విఘాతం కలిగించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు కూడా, స్వామివారి పవిత్రతను కాపాడటమే ఏకైక లక్ష్యం కావాలి. చారిత్రక సాక్ష్యాలు చెబుతున్న సత్యం ఒక్కటే — “ధర్మాన్ని అపహాస్యం చేసిన వారు దైవం నుండి తప్పించుకోలేరు.”
పురాణాల ప్రకారం, గరుత్మంతుడు విమానాన్ని వైకుంఠం నుండి భూమికి తీసుకువచ్చాడని ప్రతీతి. అదే విమాన గోపురం. దాని కింద భక్తులకు అమితమైన ఆనందాన్ని ప్రసాదించే ‘ఆనంద నిలయం’ ఉంది. భక్తులకు ఆ ఆనందానికి బదులు బాధను కలుగజేస్తే, ఆ సుదర్శన చక్రధారి నుండి తప్పించుకునే వాడు ఈ భూమండలంలో పుట్టలేదు.