– ప్రపంచంలోని కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు
– కల్తీని వైసిపి నేతలు సమర్ధిస్తున్నారా?
– సిఎఫ్‌టిఆర్ ఐ రిపోర్టును తుంగలో తొక్కారు
– అవినీతికి పాల్పడి ఆలయ పవిత్రను భ్రష్టుపట్టించారు
– సప్లిమెంటరీ చార్జ్‌షీట్ లోని అంశాలబట్టి ముందుకెళ్తాం
– వైసిపి వ్యవహారశైలిపై విరుచుకుపడిన వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: వైసిపి పాలనలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో రూ.250 కోట్ల మేర అవినీతి జరిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. కల్తీకి పాల్పడడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్ , నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధిలతో కలిసి మీడియా సమావేశంలో వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు.
తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది కానీ, జంతుకొవ్వు కలవలేదని వైసీపీ వారంటున్నారని, కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారంటే, కల్తీని వైసీపీ వారు సమర్థిస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేయించడం ద్వారా వైసీపీ వారు బరితెగించారన్నారు. తిరుమలలో రెండే కొండలున్నాయంటూ మాజీ సిఎం జగన్‌రెడ్డి వితండవాదం చేశారన్నారు.
అన్యమతస్తులను తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించి, డిక్లరేషన్ చేయాలన్న నియమాన్ని కూడా ఉల్లంఘించారన్నారు. కల్తీ జరిగిందని వైసీపీ హయాంలో సీఎఫ్ టీఆర్ ఐ రిపోర్టు స్పష్టం చేసినా తుంగలో తొక్కారన్నారు. హిందూ ధర్మం మూలాల్ని దెబ్బతీసేలా గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మంత్రి దుయ్యబట్టారు. కావాలనే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
” ఇటీవల సిట్ కోర్టులో సప్లిమెంటరీ చార్ట్ షీట్ ఇచ్చిందని చెప్పిన తర్వాత వెంటనే వైసిపి నాయకత్వం స్పందించింది. సప్లిమెంటరీ చార్ట్ షీట్లో విషయాలు మాకైతే తెలియదు కానీ, దీంట్లో కల్తీ జరిగింది… కానీ జంతు కొవ్వు లేదన్న విధంగా మాట్లాడారు. అంటే కల్తీ జరిగిందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు.
చంద్రబాబు నాయుడు ఎన్డిబిటి రిపోర్ట్ ను ఆధారంగా చేసుకొని ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలను ఆనాడు ప్రస్తావించారు. నేను వైసిపి వారిని అడుగుతున్నది ఏంటంటే.. కల్తీని మీరు సమర్థిస్తున్నారా….కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా? అంగీకరిస్తున్నారా? దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా? సమాధానం చెప్పాల్సిందే…” అన మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు.
“అదే సమయంలో అనేక పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కేవలం పామాయిల్ గానీ, ఇతర కెమికల్స్ ని వాడి నెయ్యిని తయారు చేశారని కూడా వార్తలొచ్చాయి. అంటే మరి నెయ్యే లేకుండా లడ్డూలెలా తయారు చేశారో కూడా వైసిపి నాయకులు సమాధానం చెప్పాల్సి ఉంది. పాలు లేకుండా నెయ్యిని తయారు చేస్తున్నారంటే వైసిపి వారు ఎంతకు బరితెగించారో మనం అర్థం చేసుకోవచ్చు.
సప్లిమెంట్ చార్జ్ షీట్ లో సిబిఐ ఏం వేసింది అనే విషయం వస్తే… దాంట్లో అసలు నెయ్యి ఉందా చుక్క నెయ్యి ఉందా? లేదా? అనే విషయం కూడా తెలియాల్సి వస్తుంది. తెలిసినప్పుడు మాత్రం కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో ప్రధాన కారణమేంటంటే రూ. 250 కోట్ల మేర అవినీతికి పాల్పడే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు.
తర్వాత వాస్తవాలు బయటపడుతున్న క్రమంలో ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంగా కాకుండా, దీన్ని కూడా రాజకీయ అంశంలాగా చేసి, వితండవాదం చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు
ఆలయాల పవిత్రను కాపాడే ప్రయత్నం ఏనాడూ ఆ పార్టీ చేయలేదు…
” వైసిపి చరిత్రను చూస్తే… ఏనాడూ ఆలయ పవిత్రతను కాపాడే ప్రయత్నం చేయలేదనే విషయం మనకు అర్థమవుతుంది. అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. భగవంతుడు ఏడు కొండల పైన నెలకొని ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే… ఏ చిన్న పిల్లాడినైనా అడిగినా ఇట్టే చెప్తారు. కానీ రెండే కొండలున్నాయని వితండవాదం చేశారు. దాని తర్వాత కూడా అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు.
అన్య మతస్తులు ఉద్యోగస్తులుగా ఉండకూడదంటే…అలాంటి ఉద్యోగుల్ని చేర్చారు. ఇటువంటి చర్యలన్నీ కూడా ఆలయ పవిత్రను దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే. అతి పవిత్రంగా భావించే బ్రహ్మోత్సవాల సందర్భంగా పాటించాల్సిన సంప్రదాయాన్ని మాజీ సిఎం జగన్‌రెడ్డి తన హయాంలో పాటించలేదు. అన్యమతస్తులు దర్శనానికి వెళ్ళాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది.
ఆ నిబంధనను కూడా ఏనాడు పాటించిన దాఖలాలు లేవు. రాష్ట్రపతి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వగా, అన్యమతస్తుడిగా నాటి సిఎం జగన్‌రెడ్డి డిక్లరేషన్ సమర్పించిన దాఖలాల్లేవు. 2022 ఆగస్టులో వచ్చిన సియఫ్ టిఆర్ ఐ రిపోర్ట్ ని తొక్కిపెట్టేసి ప్రజలకు తెలియనీయకుండా తద్వారా బార్గేనింగ్ పవర్ పెంచుకునే ప్రయత్నం కూడా చేశారు. దాని వెనక ఏం జరిగిందో కచ్చితంగా వైసిపి నాయకత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేదు?
కల్తీ జరిగిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? అంటే కల్తీ ముందే జరిగింది. దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి, దీన్ని అవినీతిమయం చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసి, ముఖ్యంగా హిందూ ధర్మ మూలాలనే దెబ్బతీసే విధంగా ఐదేళ్లలో జరిగింది. ఇప్పుడు కూడా దీన్ని రాజకీయ అంశం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు.
కావలసిన కంపెనీకి కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే సడలింపులిచ్చారు…
” కల్తీకి కారణమైన రసాయనాన్ని పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) చెప్పినా, అందుకు విరుద్ధంగా కావలసిన కంపెనీలకు కట్టబెట్టే ఉద్దేశంతో ఆ సడలింపు ఇచ్చారు. దీని వెనుక దురుద్దేశం ఉందనే విషయం స్పష్టమవుతోంది. అన్ని తెలిసే డెలిబరేట్ గా, అవినీతి పాల్పడి ఆలయ పవిత్రత కూడా దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు.
ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కేఎంఎఫ్ సంస్థ రోజుకు కోటి లీటర్ల పాలను సేకరిస్తుంది. అటువంటి సంస్థను కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. ఎవరికీ తెలియని ఈ బోలే బాబా డైరీని దొడ్డిదారిలో తీసుకొచ్చారు. ఈ బోలే బాబా డైరీని తెచ్చిన ఆలీబా ఎవరో తెలియాల్సి ఉంది. ఆ ఆలీబాబా 40 దొంగలు ఎవరో తెలియాలి. గతంలో మీరు ఆలయాల పవిత్రను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. భవిష్యత్తులో చేయబోతారు.
అయితే.. వాస్తవాలు కూడా కచ్చితంగా బయటికొస్తాయి. సిబిఐ పంపించిన 11 పేజీల రిపోర్ట్ పై క్యాబినెట్లో చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఏరకమైన చర్యలు తీసుకోవాలో చర్చించాం. ఏ స్థాయిలో వ్యక్తులున్నా ఉపేక్షించకూడదు. సప్లిమెంటరీ చార్ట్ షీట్ లో వచ్చే అంశాల బట్టి ఏవిధంగా ముందుకెళ్లాలో అన్న విషయాన్ని క్యాబినెట్లో చర్చించడం జరిగింది. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు వైసిపికి అలవాటైనవే కాబట్టి… ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలి.. ” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.