– ఊహల్లో లక్షలు.. భూమిపై బోణీ కూడా లేదు
అదిగో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లైన్లోకి వచ్చారు! ఆయన గొంతులో అదే ధీమా, అదే రాజకీయం.. మాటల్లో సునామీ, చేతల్లో సినిమా! “జగన్ గారు వస్తున్నారు! గుంటూరు గర్జించాలి! తెనాలి నుంచి మంగళగిరి దాకా.. పొన్నూరు నుంచి పత్తిపాడు దాకా.. లక్షల మంది తరలి రావాలి!
జనం ఉప్పెనలా పోటెత్తాలి! పోలీసులు అడ్డొస్తే వాగ్వాదానికి దిగండి.. భయపడకండి.. మీ వెనుక ‘అధిష్టానం’ ఉంది!” అంటూ ఆయన చెలరేగిపోయారు. ఫోన్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ విన్న నాయకుల గుండెలు ఉప్పొంగాయి. “ఈసారి జన సమీకరణ అంటే మామూలుగా ఉండదు!” అని కలలు కన్నారు.
అనుకున్నదేంటి? జరిగేదేంటి?
సజ్జల గారి మాటలు విని ‘గుంటూరు పర్యటన’ ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతుంది అని పార్టీ నేతలు, కార్యకర్తలు (కొంతమంది) ఆకాశమే హద్దుగా ఊహించుకున్నారు. ఉదయం టిఫిన్లు, సాయంత్రం క్వార్టర్లు.. మళ్ళీ ఇలాంటి “జగన్ పరామర్శ యాత్రలు” ఎప్పుడు వస్తాయో అనుకుని ఉత్సాహంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. 150 మందికి టిఫిన్ రెడీ.. ఇంక క్వార్టర్ల సంగతి చెప్పనక్కర్లేదు!
కానీ.. సీన్ కట్ చేస్తే!
ఎవరో అమాయక కార్యకర్త తన కెమెరాలో తీసిన దృశ్యం, నాయకుల డొల్లతనాన్ని, సజ్జల గారి భారీ బిల్డప్ బండారాన్ని బజారుకీడ్చింది! లక్షల మంది మాట దేవుడెరుగు… 150 మంది టిఫిన్లలో 50 మంది కూడా రాలేదట! రోడ్డు పక్కన పట్టుమని పది బైకులు.. అక్కడక్కడా చెదురుమదురుగా తెల్ల చొక్కాలు! “లక్షల మంది వచ్చారు!” అని ఓ వీరాభిమాని గొంతు చించుకుంటూ అరుస్తుంటే, వెనకాల ఖాళీ రోడ్లు, నిర్మానుష్యంగా ఉన్న వాతావరణం చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారు.
పోలీసులతో వాగ్వాదాలు, అధిష్టానం అండ అని సజ్జల గారు ఊరించినవన్నీ కళ్ల ముందు ఆవిరైపోయాయి. మొహం చాటేస్తున్న నాయకులు, క్వార్టర్ల కోసమైనా రాని జనాన్ని, రాజకీయాల కోసం ఎలా తరలిస్తారో అని జనం తలలు పట్టుకుంటున్నారు. ఇది కదా అసలు ‘జన సమీకరణ’ అంటే!
అడిగితే మా లక్షల మంది సపరేట్ అని సజ్జల చెబుతాడేమో అని జోకులు వేసుకుంటున్న రాజకీయ విశ్లేషకులు.