– నీ భార్యకు భయపడి ప్రజలను నమ్మించడానికి తిరుమల వెళ్లినట్లు ‘సెట్’ వేసి, మొక్కుబడిగా పూజలు చేశావు
– చనిపోయిన ఆ యువకుల కుటుంబాలకు మీరు ఏం సమాధానం చెప్తారు?
– ఎమ్మెల్యే కూన రవికుమార్
మంగళగిరి: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న యాత్రలపై ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బయటకు వస్తున్నాడంటేనే ప్రజలు, ముఖ్యంగా తల్లులు భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ చేసే యాత్రలు ప్రజల కోసం కాదని, గంజాయి స్మగ్లర్లు, కల్తీ మద్యం అమ్మేవారు, భూకబ్జాదారుల కోసమని మండిపడ్డారు. జనాదరణ లేని తన యాత్రలకు VFX టెక్నాలజీతో కలర్ కొట్టి, పార్టీ బతికే ఉందని భ్రమ కలిగించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొన్న అంబటి ఇంటికి వెళ్లాడానికి 30 నిమిషాల ప్రయాణానానికి 7 గంటలు ప్రయాణం చేశాడు.
నేడు కల్తీ నేత జోగి రమేశ్ ను పరామర్శించడానికి 15 నిమిషాల ప్రయాణానికి 10 గంటలు సమయం తీసుకుంటూ, డ్రామాలు ఆడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. నాడు జగన్ నాటిన కోడాలి నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, రోజా వంటి విషపు మొక్కలే నేడు వృక్షాలుగా మారి వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు తొక్కేశాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆ విషపు వృక్షాల కొమ్మలను కత్తిరించుకోకపోతే జగన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు.
యువతకు మందు, గంజాయి ఇచ్చి రోడ్లపై ఫీట్లు చేయిస్తూ, వారి ప్రాణాలతో జగన్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు మీ రాజకీయ ప్రచారం కోసం సింగయ్యను కారు కింద నలిపి చంపేశారు. ఈరోజు మీరు చేస్తున్న ఈ పరామర్శ డ్రామా యాత్రలో మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస మరణాలకు పరోక్షంగా మీరే కారణం. కేవలం మీ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, కిరాయి మనుషులతో చేస్తున్న ఈ ప్రదర్శనల వల్ల అమాయకులు బలి అవుతున్నారు.
చనిపోయిన ఆ యువకుల కుటుంబాలకు మీరు ఏం సమాధానం చెప్తారు? రాజకీయ లబ్ధి కోసం యువకులను రెచ్చగొట్టి, వారి చావుకు కారణమవుతున్న మీ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అధికారం కోసం ఎంతమందిని బలి తీసుకుంటారు? పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను మందలించాల్సింది పోయి, జగన్ వారికి వత్తాసు పలకడం సిగ్గుచేటు. కల్తీ అసలు జరగలేదని మీకు ఎవరు చెప్పారు?
తాడేపల్లి ప్యాలేస్ లో మీరే రిపోర్టులు రాసుకున్నారా? లేక హైదరాబాద్ కేంద్రంగా నడిచే మీ సాక్షి పేపర్ లో మీరే వార్తలు అచ్చేసుకుని.. అదే నిజమని నమ్ముతున్నారా?బయట అధికారిక ల్యాబ్ నివేదికలు కల్తీ జరిగిందని నెత్తీనోరూ మొత్తుకుంటుంటే, మీరు మాత్రం సాక్షి పేపరే మాకు వేదం అన్నట్లుగా అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ప్రజలేమీ అమాయకులు కాదు.
మీ ప్యాలేస్ రిపోర్టులకు, అసలైన ప్రభుత్వ ల్యాబ్ రిపోర్టులకు ఉన్న తేడా వారికి బాగా తెలుసు. నీకు హిందూ దేవుళ్లన్నా నమ్మకం లేదు, ఆ దేవుడి ప్రసాదమన్నా గౌరవం లేదు. గతంలో ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తే.. అది కూడా తీసుకోకుండా పక్కన పడేసిన నువ్వు, ఈరోజు మా ప్రసాదాల గురించి మాట్లాడుతుంటే “దెయ్యాలు వేదాలు వల్లించినట్లు” ఉంది. మా నమ్మకాలను కాపాడకపోయినా పర్వాలేదు కానీ, ఇలా అవమానించడం మాత్రం సహించలేం.
నాడు అధికారంలో ఉన్నప్పుడు నీ భార్యకు భయపడి, కేవలం ప్రజలను నమ్మించడానికి తిరుమల వెళ్లినట్లు ‘సెట్’ వేసి, మొక్కుబడిగా పూజలు చేశావు తప్ప నీ మనసులో భక్తి లేదు. అప్పట్లో నువ్వు చేసినవన్నీ కేవలం రాజకీయాల కోసమే తప్ప దేవుడి మీద ప్రేమతో కాదని అందరికీ తెలుసు. తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు? తన సతీమణితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని ఎందుకు పాటించలేదు? అని ప్రశ్నించారు.
లడ్డు కల్తీ జరగలేదని జగన్ బుకాయిస్తున్నారు.. కానీ సిట్ (SIT), సీబీఐ (CBI) నివేదికలోని పేజీ నంబర్ 35లో కల్తీ జరిగిందని చాలా స్పష్టంగా ఉందని వెల్లడించారు. టీటీడీ టెండర్ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, అనుభవం లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి మహాపాపానికి ఒడిగట్టారని విమర్శించారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీకి కనీసం 3 ఏళ్ల పాడి పరిశ్రమ అనుభవం ఉండాలనే నిబంధనను, కేవలం ఒక్క ఏడాదికి ఎందుకు తగ్గించారు?
ఈ మార్పు ఎవరి కోసం చేశారు? మీ అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికే కదా ఈ పని చేసింది? రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలనే కనీస నిబంధనను ఎందుకు ఎత్తేశారు? అలాగే ఆహార భద్రతకు అత్యంత కీలకమైన FSSAI నిబంధనలు కూడా అవసరం లేదని ఎందుకు నిర్ణయించారు?
అంటే పాలు లేకపోయినా, నాణ్యత లేకపోయినా పర్వాలేదు, మీ జేబులు నిండితే చాలు అన్నట్లుగా వ్యవహరించారు. ఇంతటి పవిత్రమైన ఆలయంలో నిబంధనలను ఇంత దారుణంగా సడలించడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? నిబంధనలు మార్చి కల్తీ నెయ్యికి దారులు వేసింది వైబీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరు కాదా అని ప్రశ్నించారు. పాల సేకరణ, FSSAI నిబంధనలను ఎందుకు సడలించారో జగన్, వైవీ సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు అలిపిరిలో చంద్రబాబు నాయుడు కి దేవుడు పునర్జన్మ ఇచ్చింది.. నేడు తిరుమలలో జరుగుతున్న ఇటువంటి ఘోరాలను బయటపెట్టడానికే అని ఆయన స్పష్టం చేశారు.
టీటీడీలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారం కేవలం పొరపాటు కాదు, అది జగన్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేసిన రూ. 252 కోట్ల భారీ కుంభకోణం అని విమర్శించారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు ఉండాల్సిన అర్హతలను వైకాపా ప్రభుత్వం ఇష్టానుసారంగా మార్చేసింది. ఏడాదికి 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేయాలనే నిబంధనను, టర్నోవర్ పరిమితిని రూ. 250 కోట్ల నుండి రూ. 150 కోట్లకు ఎందుకు తగ్గించారు?
ఎటువంటి అధ్యయనం లేకుండా, శాస్త్రీయత లేకుండా ఈ మార్పులు చేయమని మీకు అధికారం ఎవరు ఇచ్చారు? ఇదంతా అర్హత లేని కంపెనీలకు రెడ్ కార్పెట్ వేయడానికే కదా! కేవలం మీ అవినీతి కోసం 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తెప్పించి, రెండు కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేశారు. చివరకు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి కూడా ఇదే కల్తీ లడ్డూలను పంపించి మీ కల్తీ మాఫియాను దేశమంతా విస్తరించారు.
2022లో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే CFTRI/NCRTI నివేదికలు వచ్చాయి. నెయ్యిలో కల్తీ ఉందని, రసాయనాలు ఉన్నాయని ఆ నివేదికలు మొత్తుకున్నా, మీ దోపిడీకి అడ్డం పడతాయని వాటిని ఎందుకు తొక్కిపెట్టారు? సిట్ (SIT) నివేదికలోని 35వ పేజీలో కల్తీ నిజమని స్పష్టంగా ఉన్నా, ఇంకా అబద్ధాలు ఆడటానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు అవకాశం ఇవ్వమంటే.. చుక్క పాలు లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేసేవాళ్లు మీకు స్టార్టప్ కంపెనీల్లా కనిపిస్తున్నారా?
కల్తీ మద్యం, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్లే మీకు స్టార్టప్ కంపెనీలా? మీ నేర మనస్తత్వానికి ఇవేవీ తప్పులుగా అనిపించడం లేదా జగన్ మోహన్ రెడ్డి? అంబటి, అమర్నాథ్ వంటి వారు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అవమానించినప్పుడు మీ కుల పిచ్చి ఏమైంది? కాపు రిజర్వేషన్, కార్పొరేషన్ నిధులను రద్దు చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎదురుదాడి చేయడం మానేసి, చేసిన తప్పులను ఒప్పుకోండి. హిందూ సమాజాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి.
హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న జగన్ కు, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ గారూ.. మీ నేర మనస్తత్వం వల్ల రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పటికైనా అబద్ధాలు మాని, వాస్తవాలను ఒప్పుకోండి. లేదంటే మీ ఉనికినే ప్రజలు ప్రశ్నార్థకం చేస్తారు.