– మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీతో రాజకీయ పాఠాలు చెప్పించుకున్నారు
– రాజకీయాలు, విలువలు, పార్టీ బలోపేతం, మంత్రిత్వ శాఖల గురించి చర్చ
– శివాజీ ని సాదరంగా ఆహ్వానించి, కలిసి భోజనం చేసి యోగక్షేమాలు తెలుసుకున్న లోకేష్
నేర్చుకోవడంలో నిత్య విద్యార్థి, పెద్దలను గౌరవించడాన్ని బాధ్యతగా ఆచరించే యువకుడు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. తన తండ్రితోపాటు సమానంగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న తనయుడు, నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన సీనియర్ నేత, మాజీ మంత్రి గౌతు శ్యాం సుందర శివాజీ తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
లోకేష్ ప్రత్యేక ఆహ్వానం మేరకు శుక్రవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి గౌతు శ్యాం సుందర శివాజీ కి ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ప్రస్తుత రాజకీయాలు, ఆ నాటి రాజకీయాలు, నైతిక విలువలు, పార్టీ బలోపేతం, నాడు పనిచేసిన శాఖల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గౌతు శివాజీ తో కలిసి భోజనం చేశారు. శివాజీ అలనాటి ముచ్చట్లు చెబుతుంటే ఆసక్తిగా విన్నారు. పెద్దలను గౌరవించడం తల్లిదండ్రుల ద్వారా చిననాటి నుంచే అలవర్చుకున్న నారా లోకేష్, సీనియర్ల నుంచి సలహాలు తీసుకోవడంలోనూ, తెలియని విషయాలు నేర్చుకోవడంలోనూ నిత్య విద్యార్థిగా మారతారని గౌతు శివాజీ తో భేటీ వల్ల మరోసారి రుజువయ్యింది.