– ₹50 లక్షల ప్యాకేజీని వదిలేసి ‘మోమోస్’ అమ్మడం పిచ్చితనమా? సాహసమా?
– లోకం ఏమనుకుంటుందో అన్న భయం వదిలేయ్
– నీ ఆలోచనలో దమ్ముంటే, నీ కష్టంలో నిజాయితీ ఉంటే నువ్వే ఒక చరిత్ర
మెరిసే ఏసీ గదులు… మూగబోయిన ప్రశ్నలు! గురుగ్రామ్‌లో ఒక హై-ప్రొఫైల్ కార్పొరేట్ ఆఫీస్. చేతిలో ఖరీదైన కాఫీ కప్పు, కళ్ల ముందు లేటెస్ట్ ల్యాప్‌టాప్, హోదా చూస్తే ప్రొడక్ట్ మేనేజర్. ఏడాదికి ₹50 లక్షల ప్యాకేజీ అంటే సమాజం దృష్టిలో అతడు ‘లైఫ్ సెటిల్’ అయిపోయిన మహారాజు.
కానీ ఆ ఏసీ గదుల నిశ్శబ్దంలో సాకేత్ సౌరభ్‌ను ఒక ప్రశ్న ఎప్పుడూ వెంటాడేది — “బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది సరే… మరి నా బతుక్కి ఒక అర్థం పెరుగుతుందా?” సమాజం మనకు నేర్పిన ‘సక్సెస్’ ఫార్ములా ఒక్కటే: మంచి చదువు, పెద్ద ఉద్యోగం, సురక్షితమైన భద్రత. కానీ సాకేత్‌కు అర్థమైంది ఏంటంటే — జీవితం సురక్షితంగా ఉండొచ్చు, కానీ అది సార్థకం కాకపోతే వ్యర్థం.
జీతం కడుపు నింపుతుంది… కానీ కలల్ని కాదు!
డబ్బుకు లోటు లేదు, కానీ మనసులో ఒక రకమైన ఖాళీ. ప్రతిరోజూ ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉండే మోమోస్ బండ్లను చూసి సాకేత్ ఆగిపోయేవాడు. ఆ పొగలు కక్కే మోమోస్ కోసం జనం క్యూ కట్టడం, ఆ తిండిలో ఉన్న తృప్తి అతడిని లోతైన ఆలోచనలో పడేసింది.
“ఒక సాదాసీదా స్ట్రీట్ ఫుడ్‌కు ఇంత పవర్ ఉంటే, దీన్ని కార్పొరేట్ స్టాండర్డ్స్‌తో ఒక బ్రాండ్‌గా మార్చితే?” అన్న ఆలోచన అతడి మెదడును తొలిచేసింది. అది కేవలం ఒక బిజినెస్ ఐడియా కాదు… తన చుట్టూ ఉన్న కంఫర్ట్ జోన్ సంకెళ్లను తెంచుకోవాలనే తపన.
రిస్క్ అంటే భయం కాదు… స్పష్టత!
ఉద్యోగం మానేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. నెల నెలా వచ్చే లక్షల జీతం ఆగిపోతుంది, సమాజం వేసే ‘పిచ్చోడు’ అనే ముద్ర పడుతుంది, స్నేహితులు హేళన చేస్తారు — ఇవన్నీ సాకేత్‌కు తెలుసు. కానీ ఒక రాత్రి తనే తనను అడిగేసుకున్నాడు: “నేను ప్రయత్నించకుండా ఆగిపోతే, ముసలితనంలో ఈ పశ్చాత్తాపం నన్ను జీవితాంతం వెంటాడదా?” ఆ క్షణంలో భయం చచ్చిపోయింది. లోపల రెండే మిగిలాయి — Trust (తన విజయం మీద నమ్మకం) & Guts (అనిశ్చితిలోకి దూకగలిగే తెగువ).
రోడ్డు పక్కన బండి దాకా…
మెడలో టై తీసేశాడు, చేతిలోకి గరిటె పట్టాడు. సాకేత్ ‘The Momos Mafia’ మొదలుపెట్టాడు. లక్షలు సంపాదించే వ్యక్తి రోడ్డు మీద బండి పెట్టడం చూసి అందరూ నవ్వుకున్నారు.
“ఇంత చదివి ఇదేనా చేసేది?” అని వెటకారం చేశారు. కానీ సాకేత్ విమర్శలకు సమాధానం చెప్పలేదు — తన పనితో సమాధానం రాశాడు. స్ట్రీట్ ఫుడ్ అయినా క్వాలిటీలో రాజీ లేదు, పరిశుభ్రతలో పక్కా క్రమశిక్షణ, బ్రాండింగ్‌లో పూర్తి ప్రొఫెషనలిజం — ఇవే అతడి రూల్స్. అతడు బండిని ఒక ‘బండి’గా చూడలేదు; ఒక సామ్రాజ్యానికి కావాల్సిన బేస్‌మెంట్‌గా చూశాడు.
రెండున్నర ఏళ్లు… ₹5 కోట్ల టర్నోవర్..
కాలం ఎప్పుడూ కష్టపడేవాడికి బానిస అవుతుంది. ఒక చిన్న బండి నుంచి మొదలైన ప్రయాణం, చూస్తుండగానే అవుట్లెట్లుగా, ఆపై ఫ్రాంచైజీలుగా విస్తరించింది. కేవలం రెండున్నర ఏళ్లలోనే ₹5 కోట్లకు పైగా ఆదాయం, దేశవ్యాప్తంగా గుర్తింపు, వందల మందికి ఉపాధి. ఇది కేవలం డబ్బు గురించిన కథ కాదు — ఒక మధ్యతరగతి యువకుడు తన భవిష్యత్తును తన చేతులతో రాసుకున్న విప్లవం. ఒకప్పుడు ‘రిస్క్’ అనిపించిన నిర్ణయం, నేడు వేలాది మందికి ఆశగా మారింది.
ఉద్యోగం దొరకకపోతే నువ్వు ఓడిపోయినట్లు కాదు, చిన్న పని చేస్తే నీ వాల్యూ తగ్గిపోదు. పర్ఫెక్షన్ కోసం ఆగాల్సిన అవసరం లేదు — నీ మొదటి అడుగు అద్భుతంగా ఉండక్కర్లేదు, కానీ అది గట్టిగా పడాలి. పెద్ద పెట్టుబడి కంటే నీ దగ్గర ఉన్న చిన్న ఐడియా మీద నీకు ఉండే నమ్మకమే అసలైన పెట్టుబడి.
Trust & Guts — ఈ తరం సక్సెస్ మంత్రం. Trust అంటే నీ మీద నీకుండే అచంచలమైన నమ్మకం. Guts అంటే పరిస్థితులు ఎదురు తిరిగినా ముందుకు అడుగు వేసే మొండితనం. నమ్మకం లేని ధైర్యం అహంకారం అవుతుంది; ధైర్యం లేని నమ్మకం కేవలం కలగానే మిగిలిపోతుంది. కలలు కనడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ప్రయత్నించడానికి ఎవరి సర్టిఫికేట్లు అవసరం లేదు
కమ్ ఆన్… యంగ్ మైండ్స్..
లోకం ఏమనుకుంటుందో అన్న భయం వదిలేయ్. నీ ఆలోచనలో దమ్ముంటే, నీ కష్టంలో నిజాయితీ ఉంటే — నువ్వే ఒక చరిత్ర
-కె .వి కృష్ణయ్య
(ఏపి సచివాలయం)
ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ