– ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం భట్టి ఫొటో ఏదీ?
– ప్రభుత్వ ప్రకటనలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫొటోలకే పరిమితం
– ఏపీ ప్రభుత్వ కార్యాయాల్లో డీసీఎం పవన్ ఫొటోలు
– మంత్రుల చాంబర్లలోనూ పవన్ ఫొటోలు
– దానిపై అభ్యంతరాలు త్రోసిపుచ్చిన సుప్రీంకోర్టు
– తెలంగాణలో డీసీఎం ఫొటో పెట్టరేం?
– కాంగ్రెస్ సీనియర్ల వాదన
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రికి ప్రాధాన్యం ఉంటుంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కులం కోణంలో వారిని ఆ హోదాలో నియమించేవారు. కానీ వారిది ఆరోవేలు మాత్రమే. పేరుకే ఉప ముఖ్యమంత్రి. ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఎక్కడా ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయంలోని సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర వద్ద, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి నిలబడాల్సి వచ్చేది. పనుల కోసం స్వయంగా ఆయనే రావలసి వచ్చేది. ఇదొక ఉదాహరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే సీన్.
రెండేళ్ల క్రితం సీన్ మారింది. ప్రాధాన్యం మారింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంలకు సీఎం తర్వాత అంతటి స్థానం! ఏపీలో అయితే మిత్రపక్షమైన జనసేన దళపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలు మంత్రుల చాంబర్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశించారు. ఫలితంగా అటు చంద్రబాబునాయుడు, ఇటు పవన్ కల్యాణ్ ఫొటోలు కనిపిస్తుంటాయి. కొందరు మంత్రులు మోదీ ఫొటో కూడా పెట్టుకుంటున్నారు.
అయితే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కొండలరావు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఉప ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగ హోదా లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, 12 వేల సచివాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ ఫొటోలు పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. రాజకీయ ప్రభావాన్ని చాటేందుకు ప్రజాధనం ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు చెప్పింద’ని పిటిషనర్ వాదించారు.
కానీ సుప్రీంకోర్టు ప్రధాన నాయయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, జస్టిస్ అంజారియాతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను త్రోసిపుచ్చింది. ‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటో పెడితే మీకేంటి బాధ? ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి’ అని మందలించింది. ఇదీ ప్రభుత్వ కార్యాలయాల్లో, ఉప ముఖ్యమంత్రి ఫొటోల సంబంధించిన కథ. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో పెట్టినా అభ్యంతరం లేదని స్పష్టమయిందన్నమాట!
ఇక తెలంగాణ రాష్ట్రానికొస్తే.. తెలంగాణ రాష్ట్రానికీ ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయనే సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత మల్లు భట్టి విక్రమార్క! ఎన్నికల సమయంలో కాంగ్రెసు విజయం కోసం.. కాళ్లకు బలపాలు కట్టుకుని పాదయాత్ర చేసిన ‘పుట్టు కాంగ్రెస్’ నాయకుడాయన. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత అందరి నాయకుల మాదిరిగానే భట్టి కూడా సీఎం పదవి కోసం ప్రయత్నించారు.
కానీ నాటి పీసీసీ చీఫ్, కేసీఆర్ దెబ్బతో నిలువెల్లా గాయాలయిన కాంగ్రెస్‌ను ఐసియు నుంచి జనరల్‌వార్డుకు తెచ్చి, అక్కడి నుంచి అజారుద్దీన్ లా జనక్షే్రంలోకి పరుగులు పెట్టించి, బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టే యుద్ధానికి నాయకత్వం వహించిన రేవంత్‌రెడ్డికే సీఎం పగ్గాలు అప్పగించారు. నాటి సీఎల్పీ నేతగా ఉన్న భట్టికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిన కథే!
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోతోపాటు, ఉప ముఖ్యమంత్రి భట్టి ఫొటో కూడా వేస్తున్నారు. మీడియాకు ఇచ్చే ప్రకటనల్లో కూడా భట్టి ఫొటో పెడుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఏపీలో మాదిరిగా రాష్ట్ర సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి ఫొటోలు కనిపించవు. బహుశా.. డిప్యూటీ సీఎం ఫొటో పెడితే, న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న ముందుచూపు దానికి కారణం కావచ్చు. ముఖ్యమంత్రి కోణంలో అది తప్పు లేకపోవచ్చు.
అయితే.. ఇప్పుడు స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఉప ముఖ్యమంత్రి ఫొటో పెట్టడాన్ని ఆక్షేపించలేదు కాబట్టి.. ఇకపై భట్టి ఫొటో కూడా ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయంలోని మంత్రుల చాంబర్లలో పెట్టడానికి అభ్యంతరం ఉండదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
‘‘ సీఎం గారు భట్టికి చాలా గౌరవం, ప్రాధాన్యం ఇస్తున్న మాట నిజమే. అయితే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలన్న ఆదేశం ఎప్పుడో ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికయినా మించి పోయిందేమీ లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున, భట్టి ఫొటో కూడా ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయంలోని మంత్రుల చాంబర్లలో పెట్టాలన్న ఆదేశాలు ఇప్పుడు ఇస్తే గౌరవంగా ఉంటుంద’’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.