– ప్రజానాయకుడికి బలం కండల్లోనూ, పిక్కల్లోనూ ఉండదు
– తనకోసం ప్రాణం ఇచ్చే అభిమానుల్లో ఉంటుంది
– కార్యకర్తలు, అభిమానులను వాడుకుని వదిలేయడం కాదు
– అవసరం తీరాక వారిని గుర్తుంచుకుని వారికి తగిన న్యాయం చేసేవాడే అసలైన నాయకుడు
2004 లో అనుకుంటాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత..
గాంధీభవన్ లోనో, మరెక్కడో, వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కు సంబంధించిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
వైయస్ఆర్ వెళ్లారు వందలాది ఫోటోలను అమర్చారు. అన్నింటిని శ్రద్ధగా చూస్తున్నారు ఆయన. అనేక ఫోటోలలో తన వెంట ఉన్న ఒక సామాన్య వ్యక్తి పై ఆయన ద్రుష్టి పడింది. అతడు తనతో పాటు చాలా ఫోటోలలో ఉన్నాడు. కొన్ని ఫోటోలలో తన పక్కన, మరికొన్ని ఫోటోలలో తన పాదాలు వత్తుతూ, కొన్ని ఫోటోలలో తనకు బూట్లు వేస్తూ, మరి కొన్ని ఫోటోలలో మంచినీరు అందిస్తూ.. ఇలా కనిపించాడు.
అతను ఎవరో వైయస్ఆర్ కు తెలియదు. అతను ఎవరో కాంగ్రెస్ కార్యకర్త ఏమో అనుకున్నాడు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు తీసిన అన్ని ఫోటోలలో ఆ వ్యక్తి కనిపించాడు. “ఎవరు ఇతను?” అని అడిగాడు పక్కనున్న కార్యకర్తలను అందరూ తమకు తెలియదు అంటే తమకు తెలియదు అని బదులిచ్చారు. ఆశ్చర్యపోయాడు వైయస్ఆర్.. తనకు తెలియదు, కార్యకర్తలకు తెలియదు.. మరి ఎవరు? ఎందుకు తనను అనుసరించాడు అన్ని రోజులు.? పాదయాత్ర తరువాత అతను మళ్ళీ కనిపించలేదు.
ఆ ఫోటోల ఆధారంగా, అతను ఎవరో, ఏ వూరో, ఎందుకు తన వెంట ఉన్నాడో, ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడున్నా ఆరా తీసి తన సముఖానికి తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు.
అంతే.. అతని ఫోటోలు పట్టుకుని కార్యకర్తలు వేట మొదలు పెట్టారు. ఏవూళ్ళో అడిగినా అతని ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో ఒక గ్రామవాసి అతడిని గుర్తుపట్టి అతని వివరాలు చెప్పాడు. స్థానిక నాయకులు అతని ఇంటికి పరుగుతీశారు. తీరా చూస్తే అతను యాదవ కులానికి చెందిన పశువుల కాపరి. పూరిగుడెసె లో నివసించే అతి పేదవాడు.
ఎందుకు వైయస్ఆర్ వెంట తిరిగావు అని ప్రశ్నించారు నాయకులు.
“నాకు చాలారోజుల నుంచి వైయస్ఆర్ అంటే అభిమానం. ఆయన పాదయాత్ర చేస్తున్నాడని తెలిసి ఆయనకు సాయంగా ఉండాలని నిర్ణయించుకుని ఒకరోజు ముందు చేవెళ్ల వెళ్లాను. అక్కడి నుంచి గుంపులో కలిసి ఆయనతో తిరిగాను. ఆయనకు వడదెబ్బ కొట్టినప్పుడు సేవ చేసే అవకాశం లభించింది. ఆయనకు మంచినీళ్లు అందించే అదృష్టం దొరికింది. పాదయాత్ర అయిపోగానే నేను నా ఇంటికి వచ్చాను. అంతే తప్ప మరేమీ లేదు” చెప్పాడు అతను భయపడుతూ.
వెంటనే అతడిని నాయకులు హైదరాబాద్ తీసుకుని వచ్చారు. వైయస్ఆర్ ఇంటికో, లేక గాంధీ భవన్ కో తీసుకెళ్లి వైయస్ఆర్ ముందు నిలబెట్టారు.
అతను ముందే అతని గూర్చి వివరాలు అందించారు వారు. అతన్ని చూడగానే వైయస్ఆర్ లేచి ఎదురు వచ్చి అతడిని గట్టిగా కౌగలించుకుని అతడు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సాక్షాతూ ముఖ్యమంత్రి తనను కౌగిలించుకోవడం తో అతను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాడు. దేహమంతా చిగురుటాకు లా వణికి పోయింది.
తన పక్కనున్న స్నేహితుడితో ఒక ఆరు అంకెల భారీ అమౌంట్ ను చెప్పి “రెండు నెలల పాటు తన వృత్తి, వ్యాపారం, భార్యా పిల్లలను సైతం వదిలేసి నా వెంట తిరిగాడు. ఏమిచ్చినా అతని ఋణం తీర్చుకోలేము. ఆ అమౌంట్ అతని పేరుతో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి ఆ వడ్డీ తో జీవితాంతం సుఖంగా జీవించే ఏర్పాటు చెయ్యండి” అని కోరాడు.
ఆ ఆదేశం గంటల్లో అమలు అయింది.
* * *
అధికారం ఉన్నప్పుడు, పదవులు ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా ప్రతి ఒక్కరూ మూగుతారు. డబ్బున్న వారికి లోకమంతా బంధువులే ఉంటారు. డబ్బు, అధికారం పోయినపుడు భార్యా పిల్లలు కూడా విలువ ఇవ్వరు. మనం నిర్భాగ్యులు గా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారే మన ఆత్మీయులు. ప్రజానాయకుడికి బలం కండల్లోనూ, పిక్కల్లోనూ ఉండదు. తనకోసం ప్రాణం ఇచ్చే అభిమానుల్లో ఉంటుంది. అలాంటి అభిమానులను తయారు చేసుకోవడంలోనే నాయకుడి సమర్ధత, చాకచక్యం నిబిడీకృతంగా ఉంటాయి.
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగా పలికే
తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము అంటారు మహాకవి శ్రీశ్రీ…
రాజకీయనాయకులు నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఇది. కార్యకర్తలు, అభిమానులను వాడుకుని వదిలేయడం కాదు. అవసరం తీరాక వారిని గుర్తుంచుకుని వారికి తగిన న్యాయం చేసేవాడే అసలైన నాయకుడు.
-సీనియర్ జర్నలిస్టు,
బెంగుళూరు