– టీటీడీకి అమ్మేది స్వచ్ఛమైన నెయ్యి అంటున్నారు
– మరి ప్రజలకు కల్తీ నెయ్యి అమ్ముతున్నారనుకోవాలా?
– లేక శ్రీవారి సొమ్మును అడ్డంగా దోచుకుంటున్నారా?
మండలి బీఎసీ భేటీ నిర్ణయాల్ని వెల్లడించిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
వెలగపూడి: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలు చేసిన ఆరోపణలపై శాసనమండలిలో తాము కోరుతున్న చర్చకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇవాళ అంగీకరించిందని, దీంతో పాటు క్షీణిస్తున్న శాంతి భద్రతలు, అన్నదాతల ఆక్రందనలపైనా చర్చ చేపట్టబోతున్నట్లు విపక్ష నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై మండలిలో చర్చ కోరాం. లడ్డూ మీద ప్రభుత్వం వేసిన అపవాదులపై 26వ తేదీన చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించాం. బీఏసీ భేటీలో మూడు అంశాలపై చర్చ చేపట్టాలని కోరాం. ఇందులో మొదటిది రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, రెండవది రైతుల ఇబ్బందులు, మూడవది లడ్డూ నెయ్యి మీద చర్చ కోరాం. ప్రభుత్వం తరఫున విద్య, సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దామన్నారు. దానికీ అంగీకరించాం. వైజాగ్‌లో గీతం వర్సిటీ పేరు మీద 5 వేల కోట్ల విలువైన భూములు దోచుకోవాలని చూస్తున్నారు. నిన్న మొన్న పెట్టిన స్టార్టప్ కంపెనీలకు 99 పైసలకే కారు చౌకగా భూములు కట్టబెట్టిన వ్యవహారంపైనా చర్చ కోరాం. దీనిపైనా చర్చ జరగబోతోంది.
శ్రీవెంకటేశ్వరస్వామి ఫొటోల్ని చెప్పులతో పట్టుకున్నారని సగం ఫుటేజ్ తీసుకొచ్చి హడావిడి చేశారు. ఇవాళ బీఏసీ మీటింగ్ లో ఫూర్తి ఫుటేజ్ కావాలని కోరాం. అందులో చూస్తే ఆ దృశ్యాలు లేవు. కాబట్టి ఈ వీడియోల్ని ఎలా మార్ఫింగ్ చేశారన్నది చర్చించాలని మండలి ఛైర్మన్‌ను కోరాం.
హెరిటేజ్ వెనుక ఉన్న ఇందాపూర్ డెయిరీ మార్కెట్లో కేజీ నెయ్యి రూ.560 ప్లస్ జీఎస్టీకి అమ్ముతూ.. టీటీడీకి మాత్రం అదే కేజీ నెయ్యి రూ.658కు సరఫరా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలకు తక్కువ రేటుకు కల్తీ నెయ్యి అమ్ముతున్నారని అనుకోవాలా? లేక టీటీడీకి రూ.658కి అమ్మడం శ్రీవారి సొమ్మును దోచుకుంటున్నట్లా? దీనికి ప్రభుత్వం చెప్పాలి. అందుకే దీనిపై మండలిలో చర్చించాలని కోరాం. మీకు ధనార్జన ఆశ లేకపోతే దేవుడికి సరఫరా చేసే నెయ్యి రూపాయి తగ్గించి ఇవ్వాలి కదా? ఈ అంశంపై చర్చకు పట్టుబడితే ఇప్పటివరకూ తప్పించుకున్నారు.
రాజమండ్రిలో పాలు కల్తీ అయి నలుగురు చనిపోవడం, 20 మంది వరకూ ఆస్పత్రిపాలు కావడం దురదృష్టకరం. ఇక్కడ వ్యక్తులకు దీన్ని ఆపాదించడం కంటే ప్రభుత్వ వైఫల్యంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం, దిగువస్దాయిలో అవినీతి పెచ్చుమీరిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. గతంలో కల్తీ సారా మరణాలు చూశాం, కానీ కల్తీ పాలతో జనం చనిపోవడం ఇప్పుడే వింటున్నాం. అన్ని శాఖల్నీ గాలికొదిలేశారు.
రాజమండ్రిలో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. కల్తీ చేసిన వారితో పాటు అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మీద భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నామని మండలి ఛైర్మన్ బొత్స సత్యనారాయణ చెప్పారు.