– 5 సార్లు రైతుభరోసా ఇవ్వాల్సి ఉంటే రెండు సార్లు ఎగనామం
– 2024-25 యాసంగిలో మూడెకరాల వరకే డబ్బులు
– అధికారంలోకి వస్తే ఎకరానికి ఏడానికి రూ.15 వేలు ఇస్తామని.. అధికారంలోకి రాగానే 12 వేలకు తగ్గింపు
– రూ.12 వేల చొప్పున ఇచ్చింది ఒకసారి మాత్రమే
– ఓ వైపు యూరియా కష్టాలు.. మరోవైపు రైతుబంధు ఇవ్వకుండా మోసం
– ఓ సారి సంక్రాంతి వాయిదా.. మరోసారి మున్సిపల్ ఎన్నికల వాయిదా
– ఎన్నికలు ముగిసినా పత్తాలేని రైతుభరోసా
– రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: రైతుభరోసా ఇవ్వకుండా ఉండటానికి మేమేమన్న దివానాగాళ్లమా అని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు తాము దివానాగాళ్లమని ఒప్పుకుంటున్నట్టేనా అని బీఆర్ఎస్ నాయకులు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ బుద్ధి ఏంటో తెలుసు కాబట్టే.. వాళ్లు వస్తే రైతుబంధుకు రాం రాం అంటారని.. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అదే పని చేస్తోందని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే ఎకరానికి ఏడాదికి 15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. 15 వేలు కాదు కదా.. కనీసం కేసీఆర్ గారు ఇచ్చినట్టుగా రూ.10 వేలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మొత్తం ఐదు సార్లు రైతుభరోసా ఇవ్వాల్సి ఉంటే.. కేవలం ఒకసారి మాత్రమే రైతుభరోసా ఎకరానికి ఏడాదికి రూ.12 వేల ఇచ్చారన్నారు
2023-24 యాసంగి రైతుబంధు కోసం కేసీఆర్ సర్కారు నిధులు సమకూర్చి పెట్టి వెళితే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆరోపించారు. డిసెంబర్ లో ఇవ్వాల్సిన రైతుబంధు.. మే నెల వరకు ఇచ్చారని … అప్పుడు కూడా లోక్ సభ ఎన్నికల ఉండటంతో ఇచ్చారని చెప్పారు.
2024 వానాకాలం పూర్తిగాఎగ్గొట్టారని తెలిపారు. ఇక 2024-25 యాసంగికి మూడెకరాల వరకు ఇచ్చి మిగతా వారికి ఎగ్గొట్టారని వివరించారు. ఆ తర్వాత.. 2025 వానాకాలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేదా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో మొదటిసారి రైతుభరోసా ఇచ్చారన్నారు. ఇప్పుడు యాసంగి పంటకు వచ్చే సరికి మళ్లీ ఎగనామం పెట్టారని అన్నారు. దానికి కూడా శాటిలైట్ సర్వే అని.. సాగు చేసిన వారికే రైతు భరోసా అని కొర్రీలు పెట్టడంపైనా ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వానాకాలం రైతు భరోసా జూన్, జులై నెలల్లో, యాసంగి రైతు భరోసా డబ్బులు డిసెంబర్ నెలలో అందేవని సతీష్ రెడ్డి గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక రైతులను పూర్తిగా ఆగం చేశారన్నారు. పెట్టుబడి సాయం కోసం పెట్టిన పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నారని.. పెట్టుబడికి డబ్బుల్లేక రైతులు పంటలు వేయలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతుల బతుకులను పూర్తిగా రోడ్డున పడేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పూర్తిగా రైతు వ్యతిరేకి దీని ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. రేవంత్ రెడ్డి, మంత్రుల సోకులకు ప్రజా ధనాన్ని వృథా చేస్తూ.. రైతుభరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలను ఎగ్గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి ఏడానికి రూ.15 వేలు ఇస్తామని రైతులను నమ్మబలికి అధికారంలోకి రాగానే రూ.12 వేలకు తగ్గించి.. రైతులను మోసం చేశారన్నారు. ఇప్పుడు పూర్తిగా ఎగ్గొట్టి వారిని నిండా ముంచారన్నారు. ఓ వైపు యూరియా కష్టాలు.. మరోవైపు రైతుభరోసా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.