– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారు
– సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్
– నీ సొంత క్యాబినెట్ మంత్రికే ఏమీ తెలియదని నువ్వే చెప్తుంటే.. ఇక నువ్వు వేరే వాళ్లతో ఎలా పనులు చేయిస్తావు రేవంత్ రెడ్డి?
– రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ పై ఉన్న ధ్యాస.. పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీ పై లేదు
– రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా?
– మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా?
– ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి మేము సిద్ధం
– అరెస్టులు.. కక్షలు కాదు.. ముందు ఆసుపత్రి కట్టు రేవంత్
– మాజీ మంత్రి హరీష్ రావు
వరంగల్ : దేవాదుల పనులు చేయడం చేతగాక మంత్రులకో డెడ్ లైన్, ముఖ్యమంత్రికో డెడ్ లైన్ పెడుతూ దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ ఆగమాగం చేస్తోంది. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను కావాలనే నత్తనడకన సాగిస్తున్నారు. రేవంత్ రెడ్డికి కమీషన్లు తెచ్చే రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ధ్యాస.. పేదలకు ప్రాణం పోసే వరంగల్ ‘హెల్త్ సిటీ’ మీద లేదు.
వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించకపోతే.. బీఆర్ఎస్ పక్షాన వరంగల్ గడ్డపైనే నిరాహారదీక్షకు దిగుతాం. దమ్ముంటే అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా, కెమెరాలు తిప్పకుండా సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాలి. నాడు కేసీఆర్ హయాంలో ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసిన ఎంజీఎం ఆసుపత్రి.. నేడు కాంగ్రెస్ పాలనలో ఎలుకలు, పందికొక్కులకు అడ్డాగా మారింది.బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు మానుకొని ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడం మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి.
వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మా దెబ్బకే సీఎంకు సోయి వచ్చింది మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లలో కేవలం 6 మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తిచూపాం. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచాం. ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారు. ఇది బీఆర్ఎస్ విజయమే కాదు, రైతుల విజయం.
డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప.. పనులు కావడం లేదు. మంత్రులు దేవాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెబుతున్నారు, కానీ చేతల్లో మాత్రం అది వారికి చివరి ప్రాధాన్యతగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారు.రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదు.భూసేకరణకు నిధులు విడుదల చేయడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉన్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపోయేలా చేస్తున్నాడు. రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా?
బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి, 312 కిలోమీటర్ల మేర గోదావరిని నిండుకుండలా సజీవంగా ఉంచింది. 9 ఏళ్లలో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా?
ఇరిగేషన్ మీద అసెంబ్లీలో మాట్లాడతామని ముఖ్యమంత్రి అంటున్నారు. మేము మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. మైక్ కట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టు.. ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందాం.
మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలో మాట్లాడుతుంటే, ఆయనను ఆపి కడియం శ్రీహరికి దేవాదులపై మంచి నాలెడ్జ్ ఉంది, నెక్స్ట్ రివ్యూలో ఆయన్ను పిలవండి అని సీఎం అనడం ఇరిగేషన్ మంత్రిని అవమానించడమే. నీ సొంత క్యాబినెట్ మంత్రికే ఏమీ తెలియదని నువ్వే చెప్తుంటే, ఇక నువ్వు వేరే వాళ్లతో ఎలా పనులు చేయిస్తావు రేవంత్ రెడ్డి?
దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతున్నావో, నల్లమల సాగర్ కు ఎలా సహకరిస్తున్నావో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముందు ఆ 10 శాతం పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లివ్వు. బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోంది. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సింది. కేసీఆర్ ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది.
కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ..
కేసీఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవి.
రోగుల బంధువుల కోసం కేసీఆర్ ధర్మశాల నిర్మించాలని నిర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సగానికి సగం తగ్గించింది. రోడ్ నెట్వర్క్, ఎలివేషన్ వర్క్స్ అన్నీ తగ్గించేశారు. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యం. ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బీఆర్ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టింది. కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు.
జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలి. ఇంతవరకు రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? పేపర్లలో చూస్తే ‘ఓపీ సేవలు’ ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా?
ఓపీ చూడ్డానికి ఈ హాస్పిటల్ ఎందుకు? బీఆర్ఎస్ హయాంలో వరంగల్ గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టాం. దీన్ని కూడా మరో బస్తీ దవాఖానా చేయకండి. వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలి. లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతాం.
ఉత్తర తెలంగాణకు సంజీవని లాంటి వరంగల్ లో ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా మారింది. వరంగల్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అసలు సోయి ఉందా? ఎంజీఎం పరిస్థితి చూస్తే వార్తలు రాసి రాసి పత్రికా విలేకరులే విసిగిపోయారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వరంగల్ వచ్చినా ఒక్కసారైనా ఎంజీఎంను చూశారా?
రెండున్నరేళ్లలో ఆరోగ్య మంత్రి అటువైపు వెళ్లారా? ఎంజీఎం ఇప్పుడు ఎలుకలు, పందికొక్కులకు నివాసంగా మారింది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మంచాలు లేవు. టెస్టులకు మెటీరియల్ లేదు. బీఆర్ఎస్ హయాంలో ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశాం. కానీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలో నీళ్లు కారుతున్నాయని థియేటర్లనే మూసేశారు. రోగులను హైదరాబాద్ కు పంపిస్తున్నారు. మేము కేథలాబ్ లు, మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మీ చేతిలో పెడితే, వాటిని నడిపించే సత్తా కూడా మీకు లేదు.
ఎక్స్‌రే మిషన్లు పనిచేయవు. ఆయుష్ ఆసుపత్రిలో మందులు లేవు. ఎంజీఎంను తక్షణమే సమీక్షించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి. పాత కబుర్లనే తీపి కబుర్లుగా సీఎం చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై వైద్యానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పీఆర్సీ అమలు చేసి, బకాయిలు చెల్లించండి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చింది. ఉద్యోగులకు 1% కంట్రిబ్యూషన్ తో, జర్నలిస్టులకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటోంది. కేసీఆర్ 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా?
రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చారా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
నిన్న వరంగల్‌లో కార్పొరేటర్లను, మొన్న బాల్క సుమన్‌ను, ఆమన్‌గల్లులో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. కక్షలు కట్టడం కాదు, ముందు ఆసుపత్రి కట్టు రేవంత్ రెడ్డి. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుంది. కేసీఆర్ గారి మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.