– టాస్క్ ఫోర్స్ దాడిలో భారీ రాకెట్ బహిర్గతం
( సునీల్ వీర్)
మన రోజూ తాగే టీ కూడా విషమై మారుతుందని ఎవరూ ఊహించరు. కానీ లాభం కోసం కొందరు దుర్మార్గులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. పోలీసులు అరెస్టు చేసి వివరాలు బయటపెట్టినా ఇంకా జాగ్రత్తపడకపోతే అది ప్రజల ఖర్మే.
తాజాగా హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం, సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలో దాడి చేసి టీ పొడి కల్తీ చేస్తున్న జగన్నాథ్ బిష్ణోయ్ (33) అనే వ్యక్తిని పట్టుకున్నారు.
ఆరోపణల ప్రకారం, కోకోపీట్కు బెల్లం నీరు కలిపి ఆరబెట్టి, అందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ “సన్సెట్ యెల్లో”, “టార్ట్రజైన్ ఆరెంజ్” కలిపి నకిలీ టీ తయారు చేస్తున్నాడు. ఒక్క కిలో టీకి తక్కువ నాణ్యత టీ డస్ట్, టీ గ్రాన్యూల్స్తో పాటు రంగు కలిపిన కోకోపీట్ కలిపి అసలు టీగా అమ్ముతున్నాడు. ఈ కల్తీ టీని స్థానిక టీ బండ్లకు, డీలర్లకు సరఫరా చేస్తున్నట్టు విచారణలో బయటపడింది.
దాడిలో 120 కేజీల కల్తీ టీ, 30 కేజీల సహజ టీ పొడి, 138 కేజీల కోకోపీట్ మిశ్రమం, సింథటిక్ రంగులు, గ్యాస్ సిలిండర్ తదితర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. లాభం కోసం మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు గుర్తింపు పొందిన విక్రేతల వద్దనే టీ కొనుగోలు చేయాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలపై వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
హెచ్చరిక స్పష్టం: టీ బండ్ల వద్ద తాగే ముందు ఒక్కసారి ఆలోచించండి. చవకగా దొరికేదంతా మంచిదే అనుకోవడం ప్రాణాలకు ముప్పు కావచ్చు.