-3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్. పి. వి. టీకా
-1,683 ఆరోగ్య కేంద్రాల ద్వారా పంపిణీ
– 28న లాంఛనంగా జాతీయ స్థాయిలో పీఎం మోదీ, రాష్ట్రంలో సీఎం శ్రీ చంద్రబాబుచే ప్రారంభం
– తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి
– కూటమి ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న క్యాన్సర్ కేసుల గుర్తింపు సర్వే!
అమరావతి : మహిళల్లో గర్భాశాయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్) నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 14 సంవత్సరాలు నిండిన సుమారు 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్.పీ.వీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇవ్వనున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
0.5 ఎంఎల్ వ్యాక్సిన్ ను ఇంజక్షన్ రూపంలో ఇస్తామని, తద్వారా హెచ్.పీ.వీ వైరస్ ద్వారా వచ్చే క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1,683 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. తొలివిడత కింద ఇప్పటికే కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. అవసరాలకు తగ్గట్లు వ్యాక్సిన్ కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతుందని తెలిపారు.
ఈ నెల 28న ప్రధాని మోదీ రాజస్థాన్ లోని అజ్మీర్‌లో ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, దీనికి అనుగుణంగా రాష్ట్రంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమ ప్రారంభం, ఇతర ఏర్పాట్లపై మంత్రి సత్యకుమార్ బుధవారం ఉన్నతస్థాయిలో సమీక్ష జరిపారు.
సర్టిఫికెట్ జారీ!
రాష్ట్రంలో కోల్డ్ చైన్ (నిల్వ) సదుపాయం కలిగిన 1,683 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే బాలికలకు వ్యాక్సిన్ అందిస్తారు. బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చేముందు అధికారులు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి. ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వ్యాక్సిన్ ఇస్తారు. బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు సర్టిఫికేటు అందచేస్తారు. విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సుమారు 3 నెలలపాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన వివరాలు యు-విన్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రియల్ టైం డేటా కింద నమోదుచేస్తారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెచ్.పీ.వీ వైరస్ క్యాన్సర్ల (టైప్ 6,11,16,18 ) ముప్పు దాదాపుగా తగ్గుతుంది.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 23 వేల మంది బాలికలు
14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు కలిగిన బాలికలు రాష్ట్రంలో 3,45,377 మంది ఉన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల శాఖ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది ఉన్నారు. తక్కువగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారు. 28 జిల్లాల్లో ఉన్న బాలికల సంఖ్యకు అనుగుణంగా వ్యాక్సిన్ ను జిల్లాలకు పంపిణీ జరుగుతోంది.
సర్వైకల్లోనే హైరిస్కు కేసుల అత్యధికం!
మహిళలు క్యాన్సర్ బారినపడకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలను ఇంతకుముందే ప్రారంభించింది. రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ సత్యకుమార్ తొలి సంతకాన్ని క్యాన్సర్ సర్వే ఫైలుపైనే పెట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.71 కోట్ల మందికి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ (ఎన్సీడీ – 04) జరిగింది. ఇందులో 53,63,867 మంది మహిళలు ఉన్నారు.
వీరిలో 6.40% (3,43,487 మంది) సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధించి హైరిస్కుతో ఉన్నారని గుర్తించారు . బ్రెస్ట్ క్యాన్సర్‌లో 4.64%, ఓరల్ క్యాన్సర్ లో 2.90% చొప్పున హై రిస్కు కేసులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి దశల వారీగా పరీక్షలు నిర్వహించి.. ఫలితాల ఆధారంగా నిర్ధారణ జరిగిన అనంతరం మెరుగైన చికిత్స అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వివరించారు.
రూ. 2, 997 కోట్ల వ్యయo
2007-2008 నుంచి 2025-26 జనవరి 24వ తేదీ వరకు 6,32,426 మందికి క్యాన్సర్ చికిత్స అందించినందుకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 4,751.82 కోట్లు. మరోవైపు 3,32,426 మందిలో 3,99,829 మంది మహిళలు ఉన్నారు. వీరికి చికిత్స నిమిత్తం అయిన ఖర్చు రూ.2,997 కోట్లు. ఇందులో సర్వైకల్ కేసులకు అయిన ఖర్చు ఎక్కువగా ఉంది.
వ్యాక్సిన్ ఖరీదు రూ.3,927
దేశంలో అత్యధికంగా వెలుగుచూస్తోన్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండోస్థానంలో ఉంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్. పీ. వీ) వైరస్ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి దాదాపు 6 లక్షల కేసులు నమోదువుతుండగా ఇందులో 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఈ క్యాన్సర్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది.
2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారినపడుతుండగా భారతీయులు 15 లక్షల మంది వరకు ఉన్నారు. సర్వైకల్ క్యాన్సర్‌ను రూపుమాపే అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా ఈ వ్యాక్సిన్ కీలకపాత్ర పోషించబోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు కేంద్రం వ్యాక్సిన్ (గార్డాసిల్-4) బాలికలకు వేయనున్నారు. దీని ఖరీదు రూ.3,927. సింగిల్ డోస్ టీకా కార్యక్రమం 90 దేశాల్లో అమల్లో ఉంది.