– ఆధిపత్య కుల గజ్జి అహంకారానికి పసికందు బలి
– నాగర్కర్నూల్లో హత్యకు గురైన న్యాయం
– ప్రజాస్వామ్యాన్ని కాటేస్తున్న భూస్వామ్య విషసర్పం
– పాలక పక్షపు అహంకారం బూట్ల కింద నలిగిపోతున్న రాజ్యాంగ హక్కులు
– ముఖ్యమంత్రి నేరపూరిత మౌనం
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆగ్రహం
హైదరాబాద్: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన అమానుష ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు నిప్పులు చెరిగారు. సొంత జిల్లాలో శాంతిభద్రతలు కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థతను ఎండగడుతూ, ఇది కేవలం నేరం కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేయడమని ఆయన మండిపడ్డారు.
గుడిలోకి ఎంట్రీ ఫీజు కట్టలేదన్న సాకుతో ఒక రజక (బీసీ) కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేసి, రెండు నెలల పసికందు మరణానికి కారణమవ్వడం మన నాగరికతకే మాయని మచ్చ,” అని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో కుల భూస్వామ్యం మళ్ళీ బుసలు కొడుతోంది. అధికారం అండతో అహంకారం తలకెక్కిన మనుషులు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని విమర్శించారు.
పోలీసులు ‘పాలక పక్షపు ప్రైవేట్ సైన్యంగా మారారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యంగా మారిందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు, అధికార పక్షానికి చెందిన భూస్వాముల అడుగులకు మడుగులొత్తుతున్నారు. చనిపోయిన పసికందు కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి.. ఎదురు కేసులు పెట్టి వేధించడం పరాకాష్ట. పోలీసులు యూనిఫాం వేసుకున్నారా లేక అధికార పార్టీ కండువాలు కప్పుకున్నారా?” అని నిలదీశారు.
సొంత జిల్లాలో ఇంత ఘోరం జరిగినా ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడాన్ని శ్రవణ్ తప్పుబట్టారు.
“ఆధిపత్య అహంకారం విషసర్పంలా మారి ప్రజాస్వామ్యాన్ని కాటేస్తోంది. హోం మంత్రిగా రేవంత్ రెడ్డి గారు పాటిస్తున్న ఈ ‘భూస్వామ్య మౌనం’ నేరస్థులకు కొమ్ముకాయడమే. మీ జిల్లాలో పసిగుడ్డు ప్రాణం పోతే మీకు సోయి లేదా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద శిక్ష: కుల వివక్షతో సామూహిక దాడికి పాల్పడి హత్యాకాండకు కారణమైన నిందితులపై Section 103(2) (BNS) కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి.
అధికార దుర్వినియోగం చేసిన పోలీసులపై వేటు: బాధితులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. Section 248 (BNS) కింద వారిపై విచారణ జరపాలి.
బాధితులకు పూర్తి స్థాయి రక్షణ: అగ్రవర్ణ భూస్వాములు, పోలీసుల వేధింపుల నుంచి బాధితుల కుటుంబానికి వెంటనే ‘హై-లెవల్ సెక్యూరిటీ’ కల్పించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తూ, వారిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. అధికార మదంతో అణగారిన వర్గాల గొంతు నొక్కలేరు. ఈ బూట్ల కింద నలిగిపోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు అని దాసోజు హెచ్చరించారు.