- ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును తన అనుయాయులకే ఇచ్చుకున్నారు
- బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు
- తెలంగాణ తెచ్చిన మగోడు, మొనగాడు కేసీఆర్
- కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు:
- చిన్న కాంట్రాక్టర్లకి ఇచ్చిన నిధులు, టెండర్లపై శ్వేతపత్రం కోసం డిమాండ్
- చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన ఈ జీవో 17 రద్దయ్యే వరకు, బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు పోరాటం ఆపేది లేదు
- భవిష్యత్తులో జంతర్ మంతర్ లేదా ఢిల్లీ వేదికగానైనా పోరాడుతా
- 2028లో మన ప్రభుత్వమే వస్తుంది
- 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం
- ఇందిరాపార్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల మహాధర్నాలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (JAC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారం లోకి వచ్చాక అన్ని వర్గాలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు.
కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల ఇస్తామని దగా చేసిన కాంగ్రెస్
ఎన్నికల ముందు చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం (మొత్తం 72 శాతం) రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ అధికారం లోకి వచ్చాక 72 శాతం కాదు గదా, 72 పైసలు కూడా ఈ వర్గాలకు ఇవ్వకుండా అడ్డగోలు జీవోలను తెచ్చారని మండిపడ్డారు.
చివరికి గురుకుల పాఠశాలల్లో స్థానిక చిన్న కాంట్రాక్టర్లు సరఫరా చేసే కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా దక్కకుండా చేస్తూ ‘జీవో నెం.17’ (GO 17) తీసుకువచ్చి, ఆ టెండర్లను పెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన ఈ జీవో 17 రద్దయ్యే వరకు, బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
చిన్న కాంట్రాక్టర్లకి ఇచ్చిన నిధులు, టెండర్లపై శ్వేతపత్రం కోసం డిమాండ్
ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం ఇద్దరికే దక్కుతున్నాయని, రేవంత్ రెడ్డి బామ్మర్దికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సొంత నియోజకవర్గం కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును తన అనుయాయులకే ఇచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం వాళ్ల బంధువులకే కాకుండా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో రూ.4 అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చారా అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులు మరియు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్ సర్కార్‌కు ఉందా అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఒక ‘రెన్యూవల్ సీఎం’ మాత్రమే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెక్కారని, ఆయన ఒక రెగ్యులర్ సీఎం కాదని, కేవలం ‘రెన్యూవల్ సీఎం’ (Renewal CM) అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం (డబ్బులు) పంపి తన కుర్చీని కాపాడుకుంటున్నారని, ఢిల్లీకి బ్యాగులు మోసుకుంటూ పోయినన్ని రోజులు మాత్రమే ఆయన ఉద్యోగం ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణా బడుగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఢిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. ఈ ద్రోహానికి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ హయాంలో సంపద సృష్టి – అద్భుత ప్రగతి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ‘సంపద సృష్టించాలి-పేదలకు పంచాలి’ అనే దృక్పథంతో పనిచేశారన్నారు. నాడు చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుని గౌరవంగా నిలబెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ అప్పులు చేసి 1000కి పైగా గురుకులాలు కట్టించి, 6.50 లక్షల మంది బడుగు విద్యార్థులకు ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల నుండి రూ.1.25 లక్షల వరకు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, బూట్లు, బట్టలు, నాణ్యమైన భోజనం అందించారని పేర్కొన్నారు.
అప్పులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చారని, 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, 15 లక్షల మంది ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సాయం అందించారని తెలిపారు. రైతులకు రూ.72 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని నేరుగా ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు.
ముఖం బాగాలేక అద్దం పగులగొట్టుకున్న చందంగా.. తాము చేతగాక కేసీఆర్ అప్పులు చేశాడని రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. హద్దుమీరి మాట్లాడితే ఊరుకునేది లేదని, “తెలంగాణ తెచ్చిన మగోడు, మొనగాడు కేసీఆర్” అని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు.
50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం
రాష్ట్రంలో మక్కలు, వడ్లు కొనుగోలు కాక రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇవాళ ఏ ఒక్క ఊరికైనా కాంగ్రెస్ వాళ్లు వెళ్లే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టి, బొంద పెట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వదిలిపెట్టకుండా ఎట్లా పోరాడారో, బడుగుల సమస్యలపై కూడా అలాగే పోరాడతామన్నారు. బడుగు వర్గాల సమస్యలపై అధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఒకవేళ వాళ్ళు వినకపోతే భవిష్యత్తులో జంతర్ మంతర్ లేదా ఢిల్లీ వేదికగానైనా పోరాడుతామన్నారు.
2028లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, నాడు 10 వేల మంది కాదు, దాదాపు 50 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువకులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ గారు తీసుకుంటారని కేటీఆర్ అభయమిచ్చారు.