- తక్షణమే ప్రభుత్వం రెగ్యులర్ డీఈఓలను నియమించాలి
- కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది
- పెండింగ్ బిల్లులు, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారు
- సిద్దిపేట రెడ్డి సంఘంలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
సిద్దిపేట: రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈఓలు ఉన్నారు. 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది.
అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల, వారు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం రెగ్యులర్ డీఈఓలను నియమించాలి.
రాజకీయ కక్షతో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారు. కావాలంటే పథకం పేరు మార్చుకోవాలి కానీ, బడుల అభివృద్ధిని ఆపొద్దు. కొత్తగా పాఠశాలల్లో ఒక్క గది కూడా కట్టే ప్రయత్నం చేయడం లేదు.
పాఠశాలల్లో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి నాలుగు నెలలు, ఈ ఏడాదివి నాలుగు నెలలు పెండింగ్లో ఉండటంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడుతోంది. పెండింగ్ బిల్లులు, డీఏల సమస్యలతో పాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తోంది.